Mar 01,2023 21:46

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించండి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం దుర్మార్గమైన పాలన సాగిస్తోందని, ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అభ్యర్దులే ఉండాలని చూస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. అధికార పార్టీ దౌర్జన్యలను, అక్రమాలను ఎదుర్కొని పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల పట్టణంలో పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల పిడిఎఫ్‌ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన సమావేశానికి పట్టభద్రుల అభ్యర్థి పోతుల నాగరాజుతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్యతిధిగా పాల్గొని మాట్లాడారు. డబ్బు, దౌర్జన్యాలతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చూస్తున్నారని, సిఎం కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఉపాధ్యాయులు, పట్టభద్రుల జోలికి రాలేదని, ఈ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కలుషితం చేస్తున్నారన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులతో అర్జీ కూడా తీసుకోని మూర్ఖపు ముఖ్యమంత్రి అని విమర్శించారు. వైసిపి అధికార పార్టీ ఆగడాలని అడ్డుకునేది ఒక వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలేనని అన్నారు. రాష్ట్రంలో ప్రమాదకరమైన పాలన సాగుతుందని, ఈ పాలనను అంతమొందించాలంటే మేధావులు, పట్టభద్రులు ఆలోచించి పిడిఎఫ్‌ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉపాధ్యాయులు, పట్టభద్రులు రాకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేస్తున్నారన్నారు. నాలుగేళ్ల కాలంలో నిరుద్యోగ యువతకు జాబ్‌ క్యాలెండరు ఎలా ఉంటుందో తెలియదని, సిఎం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం చెందారన్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.నాగరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి.రమేష్‌ కుమార్‌, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు డి.లక్ష్మణ్‌, కెఎండి గౌస్‌, ఎస్‌టియు రాష్ట్ర కార్యదర్శి హెచ్‌ తిమ్మన్న, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్‌, జె సుధాకర్‌, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి సుంకయ్య, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.