Jul 14,2023 22:29
పి.అంకంపాలెంలో మళ్లీ భూవివాదం

ప్రజాశక్తి - జీలుగుమిల్లి
        మండలంలోని పి.అంకంపాలెం పంచాయతీ పరిధిలోని 200 ఎకరాల భూ వివాదం శుక్రవారం మరోసారి ఘర్షణకు దారితీసింది. నిర్వాసితులకు, మడకంవారిగూడెంలోని కొంతమంది గిరిజనులకు రెండేళ్లుగా ఇక్కడ వివాదం జరుగుతూనే ఉంది. ఈ సమస్యను పరిష్కరించడంతో స్థానిక రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం భూముల్లోకి స్థానిక గిరిజనులు కొంతమంది ట్రాక్టర్లను తీసుకెళ్లి దున్నేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానిక నిర్వాసితులు ట్రాక్టర్లను అడ్డకున్నారు.ఈ క్రమంలో ఇరుగ్రూపుల మధ్య వివాదం తలెత్తింది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న తహశీల్దార్‌ సుందర్‌ సింగ్‌, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. తహశీల్దర్‌ సుందర్‌ సింగ్‌ ఇరువురి వద్ద ఉన్న భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఘర్షణ సర్దుమణిగింది.