ఏ జమానాలో వున్నామో అర్థంకాదు
గొంతు మీద కాళ్ళేసి తొక్కుతున్నా
కనీసం పెనుగులాడకూడదు
ఊపిరాడ్డం లేదని అరవకూడదు
కనిపించని సంకెళ్లని మెడకో
కాళ్ళూ చేతులకో తగిలిస్తారు
నవ్వుతూ ఆహ్వానించాలి
చర్మం చీరుకుపోతున్నా
గొంతెత్తడానికి వీల్లేదు
ఒక్కసారి
అదృశ్యసిరాతో రాయబడిన
ఒప్పందకాగితం మీద సంతకం చేశాక
అర్ధరాత్రైనా అపరాత్రైనా
సర్వసిద్ధంగా వుండాలి
ఒక్కసారి
నేనొక పచ్చని చెట్టునని
వాళ్ళకి వాగ్దానం చేశాక
భుజాల మీద ఎంత భారమన్నా మోపుతారు
గానుగెద్దులా మొయ్యాలి
ఒక్కొక్క కొమ్మనీ నరుక్కుంటూ వస్తూ
కొత్తగా చిగురించాలన్న
డిమాండ్‌ని నీ మెడకు వేలాడదీస్తారు
పైపెచ్చు నీలో చిగురించేగుణం
తగ్గిపోయిందని ఎత్తిపొడుస్తారు
ఒక్కసారి
మన పగులులోయల చిత్రపటం
వాళ్ళ చేతికిచిక్కాక
సర్కస్‌లో కోతిపిల్లను ఆడించినట్టు
ఆడిస్తారు!
తీగమీదో నిప్పులమీదో
ఎక్కడ నడవమంటే అక్కడ నడవాలి
చుట్టూ షరతులచట్రం బిగించి
మన నిట్టూర్పుల మీద కూడా
మేకులు కొడతారు.
సాంబమూర్తి లండ
96427 32008