Nov 25,2022 23:53

చింతూరు బిసి కాలనీలో చెరువును తలపించేలా ఉన్న అంతర్గత రహదారి

ప్రజాశక్తి-చింతూరు
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది చింతూరు మండల కేంద్రంలో తాగునీటి పైపులైన్ల ఏర్పాటు పనులు. జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద చింతూరులో కొత్తగా తాగునీటి పైపులైన్లు వేసే క్రమంలో కాంట్రాక్టరు విచక్షణ రహితంగా ప్రొక్లెయినర్‌తో తవ్వేయడంతో ఇప్పటికే ఉన్న పాత తాగునీటి పైపులైన్లు పగిలిపోయాయి. కొత్త పైపులైన్లు వేసే క్రమంలో పగిలిన పైపులైన్లకు మరమ్మతులు చేయాల్సి ఉండగా, గుత్తేదారుడు అవేవీ చేయకుండానే కొత్త పైపులైన్లు వేసి తవ్విన కాలువలను పూడ్చివేశారు. దీంతో పైపులైన్లు పగిలిన చోట తాగునీరు లీకై రోడ్లపైకి వచ్చింది చేరింది. దీనికి తోడు కొత్త పైపులైన్లు వేయడానికి కాలువలు తవ్వే క్రమంలో రోడ్లు శిథిలమయ్యాయి. ఇప్పుడు ఆ నీరు చేరడంతో రోడ్లన్నీ చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో అంతర్గత రహదారులు బురదమయంగా మారి ప్రజలు నడిచేందుకు కూడా వీలు లేకుండా ఉన్నాయి. అసలే సరైన రహదారులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే, పైపులైన్లు పగలగొట్టి ఉన్న రహదారులను కాస్త బురదమయం చేయడంతో మండల కేంద్రంలోని బీసీ కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు క్రాసింగ్‌ల వద్ద తవ్విన కాలువల్లో మట్టి సమాంతరంగా పూడ్చకపోవడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వాహనదారులు గోతులను దాటుకుంటూ వెళ్లే క్రమంలో కుదుపులకు గురికావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు సదరు గుత్తేదారునికి సరైన సూచనలు ఇవ్వకపోవడంతో ఇష్టానుసారంగా తవ్వేసి, తిరిగి మరమ్మతులు చేయకుండా వదిలేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. నివాసాల ముందు పైపులైన్ల బురద నీరు ఉండటంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని పగిలిన పైపులైన్లకు మరమ్మతులు చేయాలని, తవ్విన కాలువలను పూర్తిస్థాయిలో పూడ్చి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.