Jan 03,2021 13:14

గిలిన పాదాలు
కచ్చితంగా మాట్లాడుతాయి

భూమిలా నెఱ్ఱలు బాసిన పాదాలనుండి
రక్తం పువ్వుగా ప్రశ్నించగలదు
దుక్కుల్ని దున్నుతూ రోడ్లెక్కిన పాదాలు
గుండెపై నిరసన పెయింటింగ్‌ వేసుకొని
నినాదించగలవు

డప్పులందుకొని కొన్ని చేతులు
గజ్జలు కట్టుకొని కొన్ని కాళ్ళు
పిడికిలి బిగిస్తూ కొన్ని ఆలోచనలు
డీపిలు మారుస్తూ అంతర్జాలాలు
బువ్వతినే ప్రతీ నాలుకలు
ఒక్కటిగా ప్రశ్నించుతూనే ఉంటాయి

అవును పగిలిన పాదాలు
కచ్చితంగా ఏదో ఒక రూపంలో
మాట్లాడుతూనే ఉంటాయి
ఎందుకంటే అతనికి దేశం పుట్టకనిస్తే?
దేశానికి అతను ఊపిరిపోస్తున్నాడు

ఇంకా ఇంకా రైతు వెన్నెముకను
విరిచెయ్యాలని చూసినప్పుడల్లా
నోటికాడి ముద్దను లాక్కోవాలని చూసినప్పుడల్లా
నెత్తురు, కన్నీళ్ళు, చెమట చుక్కలను
దోచుకుపోవాలని చూసినప్పుడల్లా రాజ్యంపై
నెత్తుటిపాదాలు నోళ్ళు విప్పుతూనే ఉంటాయి..

రాజ్యమా నువ్వు కలలుకను వెలుగుల్ని చూడగలవేమో
రాజ్యమా నువ్వు ఉహాల్నికను కాగితంపైగీసుకో
పేరుపొందగలవేమో
అంతే కానీ మట్టికాళ్ళపై పెత్తనం కోసం
ఇష్టమొచ్చిన బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెడితే
ఆ మట్టే నిన్ను పూడ్చడానికి సిద్ధమౌతోంది!.
ఆ మట్టే నిన్ను ఆకాశానికి మెడపట్టుకొని
ఈడ్చుకొనిపోతుంది !.
 

- పేర్ల రాము
9642570294