పగిడ్యాల మండలంలో ప్రబలిన అతిసార
- బీరవోలు, ఆంజనేయ నగర్, పగిడ్యాలలో 46 కేసులు నమోదు
- బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి : ఎమ్మెల్యే ఆర్థర్
- గ్రామాలను సందర్శించిన డిఎంహెచ్‌ఒ, డిపిఒ
ప్రజాశక్తి - పగిడ్యాల
మండలంలోని బీరవోలు, ఆంజనేయ నగర్, పగిడ్యాల గ్రామాలలో అతిసార ప్రబలుతోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. బీరవోలు గ్రామంలో 28, పగిడ్యాలలో 10, ఆంజనేయ నగర్‌లో 8 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయని వైద్య అధికారి డాక్టర్ మోహన్ తెలిపారు. కలుషిత నీటి వలనే అతిసారా సోకిందని వైద్యులు చెబుతున్నారు. గత మూడు రోజుల క్రితం వర్షాలు కురవడంతో ఎక్కడో పైపు లీకేజీ అరయి వర్షపు నీరు అందులోకి వెళ్లి ఆ నీరు సరఫరా కావడంతో ఆ నీరు తాగి అతిసార బారిన పడి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.నీటి సరఫరా నిలుపుదల : అతిసారా సోకిన గ్రామాలలో ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీటి సరఫరాను నిలుపుదల చేసినట్టు ఎంపీడీవో వెంకటరమణ తెలిపారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు ఆర్వో కేంద్రం, ట్యాంకర్ల ద్వారా నుంచి నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. వాడుకోవడానికి పెద్ద ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు.
ప్రత్యేక చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే ఆర్థర్
పరిస్థితులకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలని, అతిసార వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ వైద్య సిబ్బందికి సూచించారు. పగిడ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం వైద్య సిబ్బందితో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది వివరాలను, మందులను వైద్య అధికారి మోహన్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంగిరెడ్డి గారి రమాదేవి, వైసిపి నాయకులు ఉదరు కుమార్ రెడ్డి, రాజు, నందికొట్కూరు కౌన్సిలర్ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : డిఎంహెచ్‌ఒ
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్‌ఒ డాక్టర్ వెంకటరమణ సందర్శించారు. అనంతరం పగిడ్యాల, బీరవోలు, ఆంజనేయ నగర్ గ్రామాల్లో ఆయన పర్యటించి అధికారులకు, వైద్య సిబ్బందికి సూచనలు ఇచ్చి అప్రమత్తం చేశారు. అతిసార వ్యాధి కేసులు పెరుగుతుండడంతో బ్రాహ్మణకొట్కూరు, జూపాడు బంగ్లా, పారుమంచాల గ్రామాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులను, వైద్య సిబ్బందిని పగిడ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పిలిపించారు. 24 గంటలు విధులు నిర్వహించేలా ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. గ్రామాలలో వాంతులు, విరోచనాలు అవుతుంటే వైద్య అధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆశా వర్కర్లపై, ఏఎన్‌ఎంలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
సమస్య ఎక్కడుందో పరిశీలించాలి : డిపిఒ మంజులవాణి
నీటి సమస్య ఎక్కడ ఉందో పరిశీలించాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి మంజుల వాణి పంచాయతీ సిబ్బందికి ఆదేశించారు. మండలంలోని బీరవోలు, ఆంజనేయ నగర్, పగిడ్యాల గ్రామాలలో ఆమె పర్యటించారు. గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ఎంపీడీవో వెంకటరమణ, ఇఒఆర్‌డి నాగేంద్రయ్య, పంచాయతీ కార్యదర్శి ఉపేంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నీటి కలుషితంపై అనుమాలు : డిప్యూటీ డిఎంహెచ్‌ఒ
నీటి కలుషితం వల్లే అతిసారా సోకి ఉండొచ్చని ఆత్మకూర్ డిప్యూటి డిఎంహెచ్‌ఓ కాంతారావు నాయక్ తెలిపారు. పగిడ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆయన సందర్శించారు. నీటిని పరీక్ష నిమిత్తం పంపించామని, పూర్తిస్థాయి చికిత్స అందించే అన్ని మందులు ఇక్కడ ఉన్నాయని చికిత్స పొందుతున్న వారికి ధైర్యం చెప్పారు.
చికిత్స పొందుతున్న అతిసారా బాధితులు










