Mar 21,2021 10:24

''జిందగీ లంబీ నహీ, బడీ హోనీ చాహియే'' ఇది ఒక హిందీ సినిమాలో హీరో డైలాగు. ఎంత ఎక్కువకాలం జీవించామన్నది కాదు ముఖ్యం, ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం.. అన్నది దాని అర్థం. 
గొప్పగా జీవించడం అనేదానికి కొలమానం ఏమిటి?
బాగా చదివి ఐఎఎస్‌, ఐపిఎస్‌ ఉద్యోగాలు చేయడం, లేదా, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కావడం, డాక్టర్లు, లాయర్లు వంటి ప్రొఫెషనల్స్‌గా ఎదగడం, - ఇవి ఒక తరహా. 
బాగా సంపాదించడం, బాగా సుఖాలను అనుభవించడం (లైఫ్‌ని ఎంజారు చెయ్యడం), తక్కువ కాలంలోనే గొప్పవాళ్ళు అయిపోవడం, ఎన్నికల్లో పోటీ చేసి, పదవులు చేపట్టి నాయకులు అనిపించుకోవడం. - ఇవి మరో తరహా.
కుటుంబాన్ని బాగా చూసుకోవడం, పిల్లల్ని కని, పెంచి, విద్యాబుద్ధులు నేర్పి, వాళ్ళచేతికి ఆస్తి అప్పగించడం, మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అవినీతికి దూరంగా ఉండడం, దానధర్మాలు కలిగిన మేరకు చేయడం, నిరాడంబరంగా జీవించడం, పదవీ కాంక్ష లేకపోవడం.
- ఇవి ఇంకో తరహా.
ఇలా చాలా ఉన్నాయి.
''ఇంతవరకూ తత్వవేత్తలు ప్రపంచాన్ని గురించి వివరించారు. కావలసింది దానిని మార్చడం'' - ఇది మార్క్స్‌ చెప్పిన మాట.
ప్రపంచాన్ని మార్చడానికి మనం ఏం చేశామన్నది కీలకం. ''చుట్టూ ఆవరించిన చిమ్మచీకటిని తిడుతూ కూచోడం కన్నా చిరుదీపం వెలిగించడం మేలు'' అన్నారు పెద్దలు. మనం జీవిస్తున్న సమాజంలో కనిపించే లోపాలను, అన్యాయాలను, అసమానతలను రూపుమాపడానికి - అంటే సమాజాన్ని మార్చడానికి- మనం ఏం చేయగలం అని ప్రశ్నించుకుని, ఏం చేయాలో నిర్ణయించుకుని, అందుకోసం జీవితాంతం కృషి చేయడం గొప్ప జీవితం అవుతుంది.

భగత్‌సింగ్‌ నిండా 24 సంవత్సరాలు కూడా జీవించలేదు. (1907 సెప్టెంబర్‌ 27న జన్మించాడు, 1931 మార్చి 23న అమరుడయ్యాడు) తక్కువ కాలమే బతికినా ఎంత గొప్పగా జీవించాడు! అదీ జీవితం అంటే.. 
హిందూస్తాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ 1924లో ఏర్పడింది. అందులో చేరాడు భగత్‌సింగ్‌. అప్పటికి అతనికి 17 సంవత్సరాలు. అంటే ఆ చిన్న వయస్సులోనే దేశ స్వాతంత్య్రం కోసం జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. 1928లో హిందూస్తాన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ అసోసియేషన్‌గా సంఘం పేరు మార్చుకుంది. అప్పటికి భగత్‌సింగ్‌కు 21 సంవత్సరాలు. అంటే 21 సంవత్సరాలకే సోషలిజం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఏర్పరచుకున్నాడు.
''మానవుడి చైతన్యం అతడి అస్థిత్వాన్ని నిర్ణయించదు, తద్భిన్నంగా అతడి అస్థిత్వమే అతడి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది'' అన్నాడు మార్క్స్‌. అంటే భగత్‌సింగ్‌ అంత పిన్న వయస్సులో విప్లవకారుడిగా ఎదగడానికి ఆయన వ్యక్తిత్వంతోబాటు ఆనాడు నెలకొన్న పరిస్థితులు, అప్పటి సమాజంలో జరిగిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు సైతం దోహదం చేశాయి. 

ఆత్మ గౌర‌వం.. ఆత్మ విశ్వాసం..

ఆత్మ గౌర‌వం.. ఆత్మ విశ్వాసం..
దాదాపు రెండువందల ఏళ్ళు మన దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకుని, కొల్లగొట్టిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను వెళ్ళగొట్టాలంటే ఆ పని రాయబారాలతోనో, వేడుకోళ్ళతోనో జరగదు. ఏదో కొద్దిమంది గొప్ప నాయకులవల్లనో ఆ పని జరగదు. అందుకే స్వామి వివేకానంద ఇలా రాశాడు ''బలహీనతను అధిగమించు. బలహీనత పాపం. బలహీనత మరణం. మిమ్మల్ని శారీరకంగా, బౌద్ధికంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే దానిని విషంగా తిరస్కరించండి. దానిలో జీవం లేదు. అది సత్యం కాదు.'' ఆయన సాధారణ ప్రజలే స్వాతంత్య్ర సాధనలో కీలకం అని గుర్తించాడు. ''భారతదేశ భవిష్యత్తు సాధారణ ప్రజలు. ఉన్నత వర్గాల వారు భౌతికంగా, నైతికంగా మృతప్రాయులు'' అని అన్నాడు. సామాన్య ప్రజల్ని ఉద్యమంలోకి కదిలించాలంటే వారిలో బ్రిటిష్‌ పాలన ఎక్కించిన ''మనకంటే బ్రిటిష్‌వాళ్ళు గొప్పవాళ్ళు'' అనే ఆత్యన్యూనతా భావం, ''మనం ఏం చెయ్యగలం?'' అనే పిరికితనం పోగొట్టడం అవసరం అని గ్రహించాడు భగత్‌సింగ్‌. అందుకే ''పగ్డీ సమ్హాల్‌'' ఉద్యమాన్ని చేపట్టాడు. అంటే ''నీ తలపాగా పరువు నిలబెట్టు'' అని అర్థం. సాధారణ ప్రజల్లో అంతర్గతంగా దాగివున్న శక్తి సామర్థ్యాలను వారికి ఆ ఉద్యమం ద్వారా గుర్తు చేశాడు.


మళ్ళీ 90 ఏళ్ల తర్వాత అటువంటి మరో ఉద్యమా అవసరాన్ని ఇప్పుడు దేశరాజధాని సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతాంగం గుర్తించింది. ఇన్నాళ్ళూ నయా ఉదారవాద విధానాల తాకిడికి బలౌతున్న భారతీయ రైతులు అప్పులపాలై, వాటిని తీర్చలేక, ఆత్మహత్య చేసుకోవడమో, వ్యవసాయాన్ని వదిలి పట్టణాలకు వలస పోవడమో పరిష్కారంగా ఎంచుకున్నారు. దేశానికే తిండిపెట్టగల శక్తి ఉన్న రైతులు బతకలేక చావడం ఏమిటన్న ప్రశ్న వారిలో తలెత్తగానే ఉద్యమానికి చేవ వచ్చింది. దానికి సంకేతంగా మళ్ళీ ''పగ్డీ సమ్హాల్‌'' నినాదం ఢిల్లీ సరిహద్దుల్లో ప్రతిధ్వనించింది. 'ఆత్మ నిర్భరత', 'దేశభక్తి' వంటి నినాదాలను వల్లిస్తూ ఆచరణలో దేశ ఆహారభద్రతనే దెబ్బతీసి, మళ్ళీ పాశ్చాత్య దేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా ద్రోహపూరితంగా నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చింది మోడీ ప్రభుత్వం. నాలుగు నెలలుగా రైతాంగం ఆందోళన చేస్తున్నా ఆ చట్టాలను రద్దు చేయడానికి ససేమిరా అంటోంది. అందుచేత దేశ రాజధాని చుట్టుపక్కలే కాకుండా, యావద్భారత దేశమంతా రైతాంగాన్ని ఆందోళనలోకి కదిలించే.. రైతు ఆత్మగౌరవ నినాదంగా ఆనాటి 'పగ్డీ సమ్హాల్‌' నినాదం దేశమంతటా దద్ధరిల్లాలి.

స‌మ‌ర‌శీల‌త‌..
మన హక్కులు ఎవరో దయతలిస్తే వచ్చేవి కావు. వాటిని మనం పోరాడి సాధించుకోవాలి. పోరాడి సాధించుకోవాలన్న లక్షణమే సమరశీలత. సామాన్య ప్రజల్లో సమరశీలత సహజంగా ఉంటుంది. పాలకవర్గాలు దానిని భ్రమలతో నిద్రాణంగానైనా ఉంచుతారు. సాధ్యం కాకపోతే తప్పుడు నినాదాలతో రెచ్చగొట్టి ప్రజలను పక్కదోవ పట్టించేందుకైనా ప్రయత్నిస్తారు.


స్వాతంత్య్రం కోసం భారతీయులలో తలెత్తుతున్న వాంఛను గమనించిన బ్రిటిష్‌ పాలకులు ప్రజలను జోకొట్టడానికి 1909లో మింటో-మార్లే సంస్కరణలను, 1917లో మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలను తెచ్చారు. భారతీయులు తమను తామే పరిపాలించుకోడానికి దశలవారీగా తాము తెస్తున్న మార్పులుగా ఆ సంస్కరణల గురించి ప్రచారం చేశారు. ఎన్నికలను ప్రవేశపెట్టి, భారతీయులకు ఓటు హక్కు కల్పించామని చెప్పారు. కానీ 1917 సంస్కరణల తర్వాత 1920 నాటికి దిగువసభకు ఓటర్ల సంఖ్య 9,09,874 మాత్రమే. ఇక ఎగువ సభకైతే 17,304 మంది మాత్రమే ఓటర్లు. ఈ సభలలో చేసే నిర్ణయాలను తోసిరాజనే అధికారం బ్రిటిష్‌ వైస్రాయికి ఉండనే వుంది. ఇంకో కుట్ర ఏమంటే నియోజక వర్గాలను మత ప్రాతిపదికన ఏర్పాటు చేయడం. అంతకుముందు 1905లో బెంగాల్‌ను కూడా మత ప్రాతిపదికనే విభజించడానికి పూనుకున్నారు. విభజించి, పాలించాలనుకున్న బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల కుట్రలను ఆనాటి జాతీయోద్యమం సమరశీలంగా ఎదుర్కొంది. వాటి ఫలితంగా 1911లో తిరిగి తూర్పు బెంగాల్‌తో పశ్చిమ బెంగాల్‌ను కలపవలసి వచ్చింది. అయితే ఆ సమరశీల పోరాటాలను తీవ్రమైన దమనకాండతో అణచివేయాలని బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. పత్రికాస్వేచ్ఛకు ఎన్నో ఆంక్షలు పెట్టింది. వేలాదిమందిని జైళ్ళల్లో కుక్కింది.


విదేశీ పాలన మీద ప్రజల ఆగ్రహం స్వదేశీ ఉద్యమం రూపంలో పెల్లుబికింది. దేశవ్యాప్తంగా విదేశీ వస్తు బహిష్కరణ పాటించారు. పోలీసుల అణచివేతను ప్రజలు ఖాతరు చేయలేదు. బ్రిటిష్‌ ప్రభుత్వం రౌలట్‌ చట్టం తెచ్చింది. తమ పాలనను వ్యతిరేకించిన వారందరినీ దేశద్రోహ నేరం కింద నిర్బంధించడానికి ఈ చట్టాన్ని వాడుకుంది. ప్రజలు శాసనోల్లంఘనకు పూనుకున్నారు. ప్రభుత్వ నిర్బంధం మరింత తీవ్రమైంది. జలియన్‌ వాలాబాగ్‌ ఘటన ఇందుకొక ఉదాహరణ. ఆ తర్వాత దాదాపు పంజాబ్‌ రాష్ట్రమంతా ఒక జైలు మాదిరిగా మారింది. చిన్న పిల్లలను కూడా వదలలేదు.


దేశవ్యాప్తంగా జయప్రదంగా శాసనోల్లంఘన జరుగుతున్న కాలంలో తమపై కాల్పులు జరిపిన పోలీసుల ఆకృత్యాలను సహించలేక చౌరీచౌరాలో (యుపిలోని గోరఖ్‌పూర్‌ జిల్లా) ప్రజలు ఆ పోలీసులనే పోలీసుస్టేషన్‌లో నిర్బంధించి, నిప్పు పెట్టారు. ఆ సంఘటన తర్వాత గాంధీజీ ఉద్యమాన్ని అకస్మాత్తుగా విరమిస్తూ ప్రకటించారు. దేశం యావత్తూ దిగ్భ్రాంతి చెందింది. మంచి వేడి మీద ఉన్న ఉద్యమంపై నీళ్ళు చల్లినట్లైంది. భగత్‌సింగ్‌ వంటి అనేకమంది యువతీయువకు లకు గాంధీజీ నిర్ణయం తీవ్ర ఆశాభంగం కలిగించింది. అయితే ప్రజల్లో రగిలిన స్వాతంత్రేచ్ఛ చల్లారలేదు. 

ర‌గిలిన విప్ల‌వ చైత‌న్యం..
సైమన్‌ కమిషన్‌ 1927లో ఏర్పాటైంది. భారతదేశానికి స్వయంపాలన ఇచ్చే విషయమై వేసిన కమిషన్‌ అది. కానీ అందులో ఒక్క భారతీయుడూ లేడు. ''సైమన్‌ గో బ్యాక్‌'' అనే నినాదంతో దేశం యావత్తూ దద్ధరిల్లింది. ఆ నిరసన ప్రదర్శనల సందర్భంగా పంజాబ్‌లో జరిగిన ఒక ప్రదర్శనలో లాలా లజపతిరారు లాఠీఛార్జీలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత మరణించారు. 


ఈ విధంగా 1905 అనంతరం దేశంలో జాతీయోద్యమంలో సమరశీలత పెరుగుతున్న నేపథ్యంలో భగత్‌సింగ్‌ జన్మించి, పెరిగాడు. ఆయన కుటుంబానికి అప్పటికే గదర్‌ ఉద్యమంతో సంబంధాలు ఉన్నాయి. 1913లో గదర్‌పార్టీ స్థాపించ బడింది. ''గదర్‌'' అన్న పేరుతో పత్రిక నడిపారు. దాని పతాక శీర్షిక ''అంగ్రేజీ రాజ్‌ కా దుష్మన్‌'' (బ్రిటిష్‌ పాలనకు శత్రువు). అందులో ఇచ్చిన ప్రకటన ఇలా ఉంది:
''కావలెను
భారతదేశంలో విప్లవం కొరకు సాహసోపేతమైన యువకులు కావలెను.
జీతం- మరణం
మూల్యం- బలిదానం
పెన్షన్‌- స్వేచ్ఛ
యుద్ధభూమి-భారతదేశం''

యుద్ధ భూమి-భార‌త‌దేశం..

యుద్ధ భూమి-భార‌త‌దేశం..
ఫిబ్రవరి 21, 1915 ''సాయుధ తిరుగుబాటు'' దినంగా నిర్ధారించుకున్నారు. కానీ ఆ విషయం ముందే బయటకు పొక్కింది. పెద్ద సంఖ్యలో గదర్‌ పార్టీ నాయకుల్ని అరెస్టు చేశారు. 42 మందికి ఉరిశిక్షలు, 114 మందికి జీవితకాల శిక్షలు విధించారు. గదర్‌ వీరుల్లో బాబా గురుముఖ్‌సింగ్‌, కర్తార్‌సింగ్‌, సోహన్‌సింగ్‌ భాక్నా, మహమ్మద్‌ బర్కతుల్లా తదితరులు ప్రముఖులు. అదే కాలంలో ఇతర ప్రాంతాల్లోనూ విప్లవకారులు తిరుగుబాట్లకు ప్రయత్నం చేశారు. జతిన్‌ ముఖర్జీ (బాఘా జతిన్‌), రాస్‌ బిహారీ బోస్‌, లాలా హరిదయాళ్‌, మేడమ్‌ కామా తదితరులు వారిలో ప్రసిద్ధులు. తెలుగునాట మన్యంలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో గిరిజన పోరాటం ఈ కాలంలోనే జరిగింది.


1920-30 దశకంలో సోషలిస్టు, కమ్యూనిస్టు గ్రూపులు ప్రారంభమయ్యాయి. రష్యా విప్లవం యువ జాతీయవాదులను ఎంతగానో ప్రభావితం చేసింది. 1924 లోనే ''కాన్పూర్‌ కుట్ర'' కేసును ముజఫర్‌ అహ్మద్‌, డాంగే తదితరులపై ప్రభుత్వం బనాయించింది. ఇంకోపక్క దేశంలో పలు ప్రాంతాల్లో కార్మిక, కర్షక పార్టీలు స్థాపించబడ్డాయి. అఖిలభారత కార్మికసంఘం (ఎఐటియుసి) ఏర్పడింది. విద్యార్థి, యువజన సంఘాలు దేశంలో పలు ప్రాంతాల్లో ఏర్పడ్డాయి. రైతు పోరాటాలు మళ్ళీ ఊపందుకున్నాయి.

లౌకికతత్వం..


లౌకికతత్వం..
భగత్‌సింగ్‌ పక్కా లౌకికవాది. జాతీయోద్యమంలో లౌకికత ఒక విడదీయలేని విధంగా పెనవేసుకుపోయిన ధోరణి. 1905 బెంగాల్‌ విభజనకు పూనుకుని, దానికి మతాన్ని ప్రాతిపదికగా చేసుకున్న బ్రిటిష్‌ పాలకులు అప్పటినుంచీ ఉధృతంగా తమ ''విభజించి పాలించు'' విధానాన్ని అమలు చేయసాగారు. భారతీయుల మధ్య మత చిచ్చు రగల్చగలిగితే తమ పాలనకు ఎదురు చెప్పేవారు ఇక ఉండరని భావించారు. కానీ జాతీయోద్యమం ఆ ఎత్తును జయప్రదంగా ఎదుర్కొంది. రైతు, కార్మిక, మహిళా, విద్యార్థి, యువజన ఉద్యమాలు అదే కాలంలో బలంగా నిర్మాణం కావడం, కమ్యూనిస్టు, సోషలిస్టు భావజాలం ప్రజల్లో పెద్దఎత్తున ప్రచారం పొందడం వలన ప్రజలలో సమైక్య జాతీయతాభావం వెల్లివిరిసింది. ముస్లింలలో అంతవరకూ బలంగా ఉన్న మతతత్వ ధోరణి, హిందువులలో ఉన్న ఛాందసవాద ధోరణి ఖిలాఫత్‌ ఉద్యమంతో వెనుకపట్టు పట్టాయి. ''మేము సిక్కులం కాదు, పంజాబీలం కాదు, మేం భారతీయులం, మా మతం దేశభక్తి'' అని గదర్‌ వీరుడు సోహన్‌సింగ్‌ భాక్నా ప్రకటించారు.


పంజాబ్‌ నౌజవాన్‌ భారత్‌ సభకు మొదటి కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా భగత్‌సింగ్‌ ''మతతత్వ సంస్థలతోగాని, మతభావాలను ప్రచారం చేసే ఇతర పార్టీలతోగాని ఎలాంటి సంబంధం ఉండకూడదు. మతాన్ని మానవుడి యొక్క వ్యక్తిగత విశ్వాసంగా పరిగణించి, ప్రజలలో సాధారణ సహనశీలతా స్ఫూర్తిని పెంచాలి'' అని ప్రకటించారు. 


ఆనాటి బ్రిటిష్‌ పాలకులు ప్రజలను మత ప్రాతిపదికన చీల్చి, విద్వేషాలను రాజేయడానికి ప్రయత్నించినట్టుగానే.. నేటి మోడీ ప్రభుత్వమూ మత విద్వేష రాజకీయాలను నడుపుతోంది. వాటికి దేశభక్తి ముసుగు తొడిగి, పబ్బం గడుపుకుంటోంది. ఆ ముసుగు తొలగించి, హిందూత్వ శక్తుల నిజరూపాన్ని బట్టబయలు చేయాలి. అమెరికా ప్రయోజనాలకు, కార్పొరేట్ల ప్రయోజనాలకు కొమ్ము కాయడమే హిందూత్వ అసలు రాజకీయం అన్న వాస్తవం తెలియజెప్పాలి. అందుకు భగత్‌సింగ్‌ వంటి విప్లవవీరుల జీవితాల నుండి లౌకిక స్ఫూర్తిని మన యువత నేడు పుణికిపుచ్చుకోవాలి.

ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న హిందూత్వ..


ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న హిందూత్వ..
కేవలం రైతులే కాదు, దేశంలో మెజారిటీగా ఉన్న యువత స్థబ్దత నుండి, రాజకీయ రాహిత్యం నుండి, పాలకవర్గ ప్రచార ప్రభావం నుండి బయటపడాలి. అందులో నుండి ఉద్యమాలబాట పట్టాలంటే వారిలో ఆత్మవిశ్వాసం పాదుకొల్పాల్సిన అవసరం చాలా ఉంది. హిందూత్వ శక్తులు ఎక్కిస్తున్న జాతీయతా భావం నిజానికి దేశంలోని వివిధ జాతుల, మతాల, ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంది. భిన్న భాషలను, భిన్న సంస్కృతులను బేఖాతరు చేస్తుంది. చివరికి ఏ తిండి తినాలో, ఏవిధంగా దుస్తులు ధరించాలో, ఏ సినిమా చూడాలో, ఎవరిని పెళ్ళాడాలో కూడా శాసిస్తుంది. దీనికి తలొగ్గడం అంటే మన యువత తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే. హిందూత్వ గురించి గొప్పగా చెప్పుకుంటూ మరోవైపు దేశాన్ని అమెరికన్‌ సామ్రాజ్యవాదులకు అప్పజెప్తున్న బిజెపి-ఆరెస్సెస్‌ ద్రోహాన్ని ఇటువంటి ఆత్మగౌరవ ఉద్యమమే బయటపెట్టగలదు. అందుకే మనకి మళ్ళీ భగత్‌సింగ్‌ స్ఫూర్తి కావాలి.

తెలుగుజాతికి నమ్మకద్రోహం!


తెలుగుజాతికి నమ్మకద్రోహం!
ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మార్కెట్‌, ఒకే పన్ను, ఒకే విద్యా విధానం, ఒకే ఆహారపుటలవాట్లు - ఇలా పైకి ఆకర్షణీయంగా కనిపించే నినాదాలతో హిందూత్వ - బిజెపి ప్రభుత్వం మన దేశంలోని వివిధ జాతుల, భాషల, సంస్కృతుల మధ్య ఉన్న వైవిధ్యాన్ని కాలరాయజూస్తున్నది. మనువాదాన్నే మన దేశ జీవన విధానంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్నది. భిన్న మతాల నడుమ ఉన్న సామరస్యాన్ని నాశనం చేస్తున్నది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి, అధికారాలన్నీ తన గుప్పెట్లో బిగించుకుంటున్నది.


ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యడంలో కీలక భూమిక పోషించింది. దానిని సమర్ధించుకోడానికి 'ప్రత్యేక హోదా' ఆశ చూపింది. తర్వాత మొండిచెయ్యి చూపించింది. రాజధాని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, విభజన హామీలు, పోలవరం పునరావాసం, కడప ఉక్కు, రైల్వే జోన్‌ - ఇలా అన్ని విషయాల్లోనూ నమ్మించి, మోసం చేసింది. తాజాగా విశాఖ ఉక్కును అమ్మి తీరుతానని అడ్డగోలుగా ప్రకటించింది. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని సవాలు చేస్తోంది బిజెపి ఏకపక్ష పెత్తందారీ పాలన. అందుకే తెలుగు 'వాడితనాన్ని' డిల్లీ పాలకులకు రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.

చైతన్యపరచడం కోసమే బలిదానం..


చైతన్యపరచడం కోసమే బలిదానం..
దేేశవ్యాప్తంగా సమరశీల వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో భగత్‌సింగ్‌ హిందూస్తాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌తో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇది దేశంలో విప్లవాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో ఏర్పడిన సంస్థ. 1925 లోనే ప్రభుత్వం విరుచుకుపడి, ''కాకోరి కుట్ర'' కేసు బనాయించింది. రాంప్రసాద్‌ బిస్మల్‌, అష్మదుల్లాఖాన్‌తో సహా నలుగురు ఉరికంబాలెక్కారు. పలువురు జీవితకాల ఖైదుకు పంపబడ్డారు. 1928లో చంద్రశేఖర్‌ ఆజాద్‌ నాయకత్వంలో సంస్థ హిందూస్తాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ అసోసియేషన్‌గా మారింది. సోషలిజం స్థాపనే లక్ష్యం అయింది.


1928 డిసెంబరు 17న భగత్‌సింగ్‌, రాజ్‌గురు, ఆజాద్‌ లాలాలజపతిరారును లాఠీఛార్జీ చేసిన బ్రిటిష్‌ ఆఫీసర్‌ శాండర్స్‌ను కాల్చి చంపారు. తమ సంస్థ రాజకీయ లక్ష్యం దేశం మొత్తానికి తెలియజేయడానికి 1929 ఏప్రిల్‌ 8న సెంట్రల్‌ అసెంబ్లీలో ఎవరినీ గాయపరచని విధంగా బాంబు విసిరారు. అక్కడే ఉండి ఉద్దేశపూర్వకంగా అరెస్టయ్యారు. వారు ఆశించినట్టుగా కోర్టును వేదికగా చేసుకుని, ప్రచారం చేయగలిగారు.

విప్లవతత్వం దేశద్రోహమంటున్న మోడీ!


విప్లవతత్వం దేశద్రోహమంటున్న మోడీ!
ఆ విప్లవ వీరుల సమరశీలతను, దేశభక్తిని ప్రజలు గుర్తించారు. అందుకే వారిని నేటికీ ఆరాధిస్తున్నారు. కానీ ఆరెస్సెస్‌-హిందూత్వ శక్తులు కొన్నేళ్ళ క్రితం వరకూ భగత్‌సింగ్‌ను ఒక హిందూత్వ ప్రతినిధిగా చెప్పుకోడానికి ప్రయత్నించాయి. దేశ ప్రజానీకం వారి ప్రచారాన్ని స్వీకరించలేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆనాటి బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన రౌలట్‌ చట్టంతో పోల్చదగిన ఉపా (యుఎపిఎ) చట్టాన్ని తెచ్చింది. ఆనాటి విప్లవ వీరులను బ్రిటిష్‌ పాలకులు ఉగ్రవాదులని, టెర్రరిస్టులని, విద్రోహులని ఏవిధంగా ముద్ర వేసి, తమ దమనకాండను సమర్ధించుకోజూశారో, నేడు మోడీ ప్రభుత్వమూ తమ విధానాలను విమర్శించేవారిని దేశద్రోహులనో, పాక్‌ ఏజంట్లనో, చైనా ఏజంట్లనో, ఉగ్రవాదులనో ముద్రవేసి, నిర్బంధిస్తున్నది. ఏళ్ళ తరబడి విచారణ లేకుండా జైళ్ళలో కుక్కుతోంది. అయితే, రానురాను ప్రజలలో చైతన్యం పెరుగుతోంది. సమరశీల స్వభావాన్ని సంతరించుకునే ఉద్యమాలు, వాటిని జయప్రదంగా నిర్వహించగల, విప్లవదీక్ష గల సమర్ధులైన యువ నాయకత్వం నేడు దేశానికి ఎంతో అవసరం. నాటి భగత్‌సింగ్‌ స్ఫూర్తి నేడు మరెంతో అవసరం. వందలాది భగత్‌సింగ్‌లు దేశానికి నేడు కావాలి.
 

సోషలిజం..

సోషలిజం..
కేవలం బ్రిటిష్‌ పెత్తనాన్ని అంతమొందిస్తే చాలదని, కోట్లాది భారతీయుల ఆకాంక్షలు నెరవేరాలంటే అందుకు సోషలిజాన్ని నిర్మించడమే సరైన మార్గమని భగత్‌సింగ్‌ గ్రహించాడు. సోషలిజం సాధించడానికి ఏం చేయాలో తెలుసుకోడానికి అధ్యయనం చేశాడు. ఉరికంబం ఎక్కబోయే కొద్ది గంటల ముందువరకూ భగత్‌సింగ్‌ లెనిన్‌ రచనలను చదువుతూనే వున్నాడు. 


నేడు మోడీ ప్రభుత్వం శరవేగంతో అమలు చేస్తున్న నయా ఉదారవాద విధానాలను సమూలంగా మార్చకుండా, పెట్టుబడిదారీ ప్రపంచాన్ని ఆవరించిన సంక్షోభానికి పరిష్కారం దొరకదు. సోషలిజమే ఆ పరిష్కారం అని ప్రస్తుత కాలంలో సంక్షోభాన్ని అధిగమించి, ముందుకు దూసుకుపోతున్న చైనా, ఇతర సోషలిస్టు దేశాలు రుజువు చేస్తున్నాయి. ఆ సోషలిస్టు భావాలను పెద్దఎత్తున ప్రజలలో వ్యాపింపజేయడానికి ప్రతి యువతి, ప్రతి యువకుడూ భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలి. ఆ విప్లవవీరుడి అధ్యయనశీలతను అందిపుచ్చుకోవాలి. 

1931, మార్చి 23న భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురును ఉరితీశారు.

1931, మార్చి 23న భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురును ఉరితీశారు.
ఏప్రిల్‌ 1930 చిట్టగాంగ్‌లో సాయుధ తిరుగుబాటు సూర్యసేన్‌ నాయకత్వంలో జరిగింది. ప్రణాళికాబద్ధంగా పెద్దఎత్తున ఆయుధాగారంపై దాడి చేయగలిగారు. భగత్‌సింగ్‌, సూర్యసేన్‌, గదర్‌ వీరులు, మన అల్లూరి గానీ ఎవరూ వ్యక్తిగత హింసావాదాన్ని సమర్ధించినవారు కాదు. ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములయ్యే విధంగా సాయుధ తిరుగుబాటు ద్వారా అంటే విప్లవం ద్వారా బ్రిటిష్‌ పాలనను తుదముట్టించదలచుకున్న విప్లవవీరులు.


భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు బలిదానానికి 90 ఏళ్ళు నిండాయి. కానీ ఆ త్యాగాలు మనకు తెచ్చిపెట్టిన స్వాతంత్య్ర ఫలాలు - లౌకిక ప్రజాస్వామ్యం, ఫెడరల్‌ వ్యవస్థ, భావ ప్రకటనా స్వేచ్ఛ, సామాజిక న్యాయం, ఆహారభద్రత, కార్మిక హక్కులు, జెండర్‌ న్యాయం - ఇన్నాళ్ళూ చాలా పరిమితంగానే అయినప్పటికీ, మనం అనుభవిస్తూ వచ్చాము. నిజానికి ఆ విషయాల్లో సంపూర్ణ స్థాయిలో న్యాయం జరగాల్సి వుండగా, దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఇప్పుడు వాటిపై దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్ని తిప్పికొట్టి, ఆ ఫలాలను మనం దక్కించుకోవాలంటే మళ్ళీ ఆ విప్లవవీరుల త్యాగస్ఫూర్తి, జాతీయోద్యమ వారసత్వం మనం స్వీకరించి, ముందడుగేయాలి. అదే మనం భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురులకు ఇవ్వగలిగే నివాళి.
అందుకే ''పగ్డీ సమ్హాల్‌ మిత్రమా!''

                                                                                                 * ఎం.వి.ఎస్‌.శ‌ర్మ‌  * ఎం.వి.ఎస్‌.శ‌ర్మ‌