Apr 17,2021 06:39

విశాఖలో గురువారం ఒక్క రోజునే జరిగిన రెండు దారుణ సంఘటనలతో రాష్ట్ర ప్రజలంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. తన కుమార్తెకు అన్యాయం చేశారని మూడేళ్ళుగా పెంచుకున్న పగ ఒక చోట ఆరుగురి హత్యలకు దారితీస్తే బాగా చదువుకున్న ఒక విద్యావంతుడి మానసిక వైకల్యం తనతో సహా నలుగురు కుటుంబ సభ్యుల ప్రాణాలను బలిగొంది. పెందుర్తి లో ఆరు హత్యలు చేసిన అప్పలరాజు తనకు తానుగా పోలీసులకు ఫోనుచేసి మరీ సంఘటనా స్థలానికి వారిని రప్పించి లొంగిపోతే, తన తల్లిదండ్రులను, సోదరుడిని హత్య చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్న దీపక్‌ కూడా మరణించాడు. కనుక పోలీసులకు ఇప్పుడు కొత్తగా ఛేదించవలసిన మిస్టరీ అంటూ ఏమీ లేదు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు లేవనెత్తే డిమాండ్లూ లేవు.


పగ పెంచుకుని సాధించేదేమీ ఉండదు అని, చావు సమస్యలకు పరిష్కారం కాదు అని అందరికీ తెలుసు. కాని పగ సాధించాలనే ధోరణి పెరుగుతోంది. ఆత్మహత్య మహా పాతకం అంటారు. కాని ఆత్మహత్యలు కొనసాగుతూనే వున్నాయి. స్త్రీలపై, అందునా బలహీన వర్గాలకు చెందిన వారిపై అత్యాచారాలు పెరుగుతూనే వున్నాయి. సమాజం పురోగమించడం అంటే కేవలం ఆర్థికంగా సంపద వృద్ధి చెందడమే అందుకు కొలబద్ద అని చెప్పి మనల్ని సంతృప్తి పరచాలని చూసే పాలకులు ఈ పెడధోరణుల పెరుగుదలకు ఏం సమాధానం చెప్తారు? సమాజం వేగంగా అభివృద్ధి చెందుతూంటే ఇంకోవైపున ఈ అమానవీయ, ఆటవిక ప్రవృత్తుల పెరుగుదల ఎందుకు సాగుతోంది? మనిషి శక్తి సామర్ధ్యాల పెరుగుదలకు తోడ్పడే శాస్త్ర, సాంకేతికాభివృద్ధి ఒక వైపు నిరంతరాయంగా కొనసాగుతూంటే మరోవైపు ఆత్మహత్యలకు పాల్పడేంత నిస్సహాయతకు లోనవుతున్నవారు ఎందుకు పెరుగుతున్నారు? నీతి ఆయోగులు, విధాన రూపశిల్పులు, భావి సమాజాన్ని నిర్దేశించడానికి వందల, వేల సంవత్సరాల వెనకటి కాలంలోకి చూసుకుంటూ, ఎక్కువసార్లు అక్కడే ఉండిపోతూ ప్రజలకు మతిపోయే ప్రవచనాలందిస్తున్న పాలకులు సమాధానం చెప్పగలరా? లేక ఇదంతా విదేశీ కుట్ర కిందో, దేశద్రోహం కిందో జమ కట్టేస్తారా?


ధర్మ పరిరక్షణ చేయడమంటే బాబ్రీ మసీదును కూల్చి పగ తీర్చుకోవడమేనని ఉద్బోధించిందెవరు? గుజరాత్‌ మారణ హోమం పగ సెగల నుండి రగిలినది కాదా? గోవులను పరిరక్షించడానికి హత్యలు చేయడం ఒక ఉద్యమంగా మార్చిందెవరు? ఇదంతా సమాజం మొత్తంమీద ఎంత లోతుగా, ఎంత విస్తృతంగా ప్రభావం కలిగించగలదో వారెవరైనా ఊహించారా? కనీసం దాని పర్యవసానాలకు బాధ్యత వహించగల నైతిక స్థైర్యం ఉందా?


సామాజిక చైతన్యాన్ని కల్పించడం విద్యా విధానంలో ఒక ప్రధాన భాగం అన్న విషయం కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని పాలకులకు గత మూడు దశాబ్దాలలో ఏనాడైనా గుర్తుకు వచ్చిందా? ఒకప్పుడు స్కూళ్ళలో, కాలేజీల్లో సామాజిక శాస్త్రాల అధ్యయనానికి, సమకాలీన సమాజ సమస్యలపై చర్చలకు చాలా ప్రాధాన్యత ఉండేది. కాని ఇప్పుడు అటువంటి విషయాలపై చర్చ నడపడం గాని, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడంగాని దాదాపు నిషిద్ధం అయిపోయింది కదా. అయినా ఏదో ఒక విధంగా చర్చిద్దామని ఎవరైనా అందుకు పూనుకుంటే వారిపై దేశద్రోహం కేసులు సైతం నమోదు అయిపోతున్నాయి.


సమిష్టి తత్వాన్ని చంపేసి వ్యక్తి ప్రయోజనానికే పెద్ద పీట వేసే చదువులు మనుషుల్లో అంతిమంగా మానసిక వైకల్యానికే దారి తీస్తాయి. కరోనా సమయంలోనూ స్వంత ఆస్తులను పెంచుకునేందుకే సిద్ధపడిన అంబానీ, అదానీలనే హీరోలుగా కీర్తించే ప్రధానులుంటే స్వార్ధమే ఆదర్శం అయికూచుంటుంది. విద్వేషాల నెత్తుటేరుల్లో రాజకీయ నౌకావిహారం చేసే నేతలు గద్దె మీద ఉంటే ప్రజల్లో పగ, విద్వేషం, పశుత్వం పాలు నానాటికీ ఎక్కువ కావడం అనివార్యం. అందుచేత ఎవరిమట్టుకు వారు తమ వరకూ మానవత్వంతో, సమిష్టితత్వంతో, ప్రేమానురాగవర్తనులై వుంటే సరిపోదు. ఈ ఉత్తమ మానవత్వ లక్షణాలన్నీ మన అందరి సమిష్టి చైతన్యంలో భాగం కావాలి. ఆ చైతన్యంతో ఈ సంక్షుభిత సమాజాన్ని ప్రక్షాళన చేయాలి.