Sep 21,2023 00:00

ప్రజాశక్తి - రేపల్లె
పెయ్య దూడల ఉత్పత్తి పథకాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని తుమ్మల గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ ఎ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర పశు గణాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ ప్రవేశపెట్టిన రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన పెయ్యల ఉత్పత్తి పధకం  పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రీన్‌ రెవెల్యూషన్‌ తరహాలో మిల్క్‌ రెవెల్యూషన్‌ రావాలన్నారు. పాడి పశువులను ఆదరించి పాల ఉత్పత్తులు పెంచాలన్నారు. రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ అందిస్తున్న కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్‌లను యదకు వచ్చిన పశువులకు ఇచ్చి నట్లుయిన 90శాతం వరకు ఆడ దూడలు పుట్టే అవకాశం ఉందన్నారు. దీని కోసం వాడే ఇంజక్షన్‌ ఖరీదు రూ.1350కాగా రైతులు రూ.500 చెల్లిస్తే సరిపోతుందన్నారు. రైతు గరికపాటి రమేష్ గేదకు లింగ నిర్ధారిత వీర్యం పెయ్యాదూడల సెమెన్ చేయగా మొట్టమొదటిగా నియోజకవర్గంలో దూడ జన్మించిందని అన్నారు. పాడి పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ 108తరహాలో పశువులు కోసం 1962టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసిందన్నారు. పశువులు  అనారోగ్యానికి గురైతే 1962 నెంబర్‌కు కాల్‌ చేస్తే అంబులెన్స్‌తో ఆ రైతు చెప్పిన స్థలానికి డాక్టర్స్‌ వచ్చి తగిన వైద్య సేవలు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గరికపాటి భానుకోటి, సచివాలయ కన్వీనర్ దేవరకొండ అనిల్, సర్పంచ్ దీపిక సురేష్, వార్డు మెంబెర్ గాదె మణీంధ్ర, గోపాలమిత్ర శివ కృష్ణ పాల్గొన్నారు.