ప్రజాశక్తి- అనకాపల్లి
గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ విదేశీ పెట్టుబడులు తేలేకపోయిందని, గ్లోబల్ సమ్మిట్‌కు అర్థమే లేకుండా పోయిందని టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు విమర్శించారు. స్థానిక పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 3, 4 తేదీల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సదస్సును గ్లోబల్ సమ్మిట్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. దీనికోసం ప్రభుత్వం రూ.250 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్ రోజుకో మాట, వారానికో కథ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పాత ఎంఓయూలు, తన సొంత ఆస్థాన సంస్థలు, దావోసులో చేసుకున్న ఒప్పందాలను ఈ గ్లోబల్ సమ్మిట్‌లో మరోసారి ప్రకటించి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ సదస్సులో అక్షంతలే తప్ప చదివింపులు లేనట్టు అర్థం అవుతుందన్నారు. ఈ ఒప్పందంలో ప్రకటించిన పెట్టుబడులు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో శంకుస్థాపనలు చేసిన పథకాలైన ఎప్పటికీ పూర్తవుతాయో వెల్లడించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ కెకెవిఎ.నారాయణరావు, పట్టణ కార్యదర్శి కోట్ని రామకృష్ణ పాల్గొన్నారు.










