Nov 16,2023 20:21

మేనిఫెస్టోను వివరిస్తున్న గుడిసె ఆది కృష్ణమ్మ

ప్రజాశక్తి - ఆదోని
ప్రతిపక్షాలపై పెట్టే ప్రతి కేసు కూడా వైసిపిపై ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోందని టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె ఆది కృష్ణమ్మ, జిల్లా మైనార్టీ అధ్యక్షులు అప్సర్‌ బాష, ఆదోని మార్కెట్‌ యార్డ్‌ మాజీ డైరెక్టర్‌ మనోహరయ్య శెట్టి, టిడిపి నాయకులు బెస్త నరసింహ (చిట్టి) తెలిపారు. గురువారం 'బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ'లో భాగంగా ఆదోనిలోని విక్టోరియా పేటలో పర్యటించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ ఓటమి కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. కడప జిల్లాలోని పులివెందులలో జగన్‌ పునాదులు కదులుతున్నాయని తెలిపారు. జగన్‌ ఓర్వలేకనే అక్రమ కేసులతో టిడిపి నాయకులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జీ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, పులివెందుల ఇన్‌ఛార్జీ బిటెక్‌ రవి అరెస్టుతోనే ప్రతిపక్షం అంటే జగన్‌ ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందని చెప్పారు. పులివెందులలో టిడిపి పుంజుకోవడంతో తన మార్కు అక్రమ కేసులతో భయపెట్టే చర్యలకు దిగారని విమర్శించారు. కడప జిల్లాలో, పులివెందులలో తీవ్ర వర్షాభావంతో రైతులు బాధపడుతుంటే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులే ప్రధానం అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సొంత జిల్లాలో చేసిన అభివృద్ధి పనుల గురించో, కట్టిన ప్రాజెక్టుల గురించో, తెచ్చిన కంపెనీల గురించో చెప్పుకుంటారని, జగన్‌ ఏ నియోజకవర్గంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టానో మాత్రమే చెప్పుకునే పరిస్థితి ఉందన్నారు. టిడిపి నాయకులు వడ్డెమాన్‌ గోపాల్‌, మురళీ, ఆదోని పట్టణ ముస్లిం, మైనార్టీ నాయకులు సాధిక్‌ వలీ, కర్నూలు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు జి.రామకృష్ణ, ఖాదర్‌ బాష, చిరంజీవి, వేమన్న, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.