అందరూ నడిచే దారిలో ఆమె నడవాలని అనుకోలేదు. కొత్త దారి వెతుక్కుంది. అది కష్టమైనా ఇష్టంగా మార్చుకుంది. ఫలితంగా ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. కేరళలోని త్రిచూర్‌కి చెందిన 24 ఏళ్ల డెలిషా డేవిస్. సాధారణంగా పెట్రోల్ ట్యాంకర్లు, లారీల వంటి హెవీ వెహికిల్స్‌ని పురుషులు మాత్రమే డ్రైవ్ చేస్తారు. అలాంటిది ఈ యువతి.. ట్యాంకర్ డ్రైవర్ వృత్తిని ఎంచుకొని, అలవోకగా పెట్రోల్ ట్యాంకర్ నడిపేస్తోంది. అయితే అసలు ఆమె పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ ఎందుకైంది? ఆమె ట్యాంకర్ నడుపుతుంటే అధికారులు ఏం చేశారు? ప్రస్తుతం ఆమె ఏం చేస్తోంది ? ట్యాంకర్ నడిపే వృత్తిని ఎందుకు ఎంచుకుంది? అనేవి తెలుసుకుందాం..
డెలిషా ప్రస్తుతం కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. అందువల్ల త్వరలోనే ఆమెకు పెద్ద ఉద్యోగం, ఐదంకెల జీతం వచ్చే అవకాశం ఉంది. కానీ డెలిషా మాత్రం పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి ఆమెకు డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టం. ఆమె తండ్రి పిఎ డేవిస్ లారీ డ్రైవర్. తండ్రి డ్రైవింగ్ చూసి, ప్రభావితురాలై, ఆమె కూడా డ్రైవర్ కావాలనుకుంది. అయితే ఒకసారి ట్యాంకర్
ఎక్కితే ఏమాత్రం అలసిపోకుండా,
ముఖంపై చిరునవ్వు చెదరకుండా డెలిషా డేవిస్ ఏకంగా 30 కిలోమీటర్లు నడిపేస్తుంది.
తండ్రి సహకారంతోనే..
డెలిషా తండ్రి డెవిస్ 42 ఏళ్లుగా ట్యాంకర్ నడుపుతున్నారు. డేవిస్ కూడా ఆమెను నిరాశపరచకుండా డ్రైవింగ్ నేర్పించారు. దీంతో ఆమె అఫీషియల్‌గా డ్రైవింగ్ నేర్చుకొని, కొచ్చి నుంచి మళప్పురానికి వారానికి మూడుసార్లు ట్రిప్పులు వేస్తోంది. ఇరుంబనంలోని రిఫైనరీ నుంచి తిరూర్‌లోని ఓ పెట్రోల్ బంకుకు ట్యాంకరును తీసుకెళ్తోంది. మూడేళ్లుగా ఇలా చేస్తోంది. అప్పుడప్పుడూ అధికారులు ఆర్‌టిఎ తనిఖీలు చేసినప్పుడు ట్యాంకరు నడిపే ఆమెను చూసి ఆశ్చర్యపోతూ ''శభాష్!'' అంటూ మెచ్చుకునేవారు.
టూ వీలర్‌తోనే ప్రయాణం..
డెలిషా డేవిస్ అందరిలాగే మొదట టూవీలర్, తర్వాత ఫోర్ వీలర్ డ్రైవింగ్ నేర్చుకుంది. 16 ఏళ్లకే రెండూ నేర్చేసుకుంది. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్సులతోపాటూ ట్యాంకర్ నడిపేందుకు కావాల్సిన అన్ని రకాల అనుమతులూ 20 ఏళ్లకే పొందింది. ఎప్పటికీ ట్యాంకరే నడపాలన్నది ఆమె ఆశ కాదు. వోల్వో బస్సును నడపాలన్నది ఆమె డ్రీమ్. అందుకు లైసెన్స్ కోసం ట్రై చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఎంకామ్ పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. అవి వచ్చాక.. తన కెరీర్ ఎలా ఉండాలో డిసైడ్ చేసుకుంటానని తెలిపింది.
డెలిషా అంత చిన్న వయస్సులోనే డ్రైవింగ్‌లో మెళకువలు నేర్చుకుని, స్త్రీ సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది. భవిష్యత్తులోనూ డెలిషా మరింత ఉన్నతంగా ఎదగాలని, ఆమె ఆకాంక్ష అయిన వోల్వో కూడా నడుపుతుందని ఆశిద్దాం.. ఆల్ ది బెస్ట్ డెలిషా !