ప్రజాశక్తి -సీలేరు
జికేవీది మండలం సీలేరు పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. సీలేరులో జిసిసి ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించారు. అయితే ఈ బంకుకు పెట్రోల్, డీజిల్ వచ్చిన వారం రోజుల్లోనే అయిపోతుంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నుంచి వస్తున్న వ్యాపారులకు డ్రమ్ములు కొద్దీ పెట్రోల్, డీజిల్ బంకు నుంచి సరఫరా చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల సీలేరు పరిసర ప్రాంతాల వాహనదారులు పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్నాళ్లుగా ఇలా జరుగుతున్నప్పటికీ జీసీసీ అధికారులు సిబ్బందిపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఈ నెల 1, 2, 3 తేదీల్లో ఈ బంకులో పెట్రోల్, డీజిల్ పూర్తిస్థాయిలో కొరత ఏర్పడింది. దీంతో సీలేరు బంకుపై ఆధారపడిన వాహనచోదకులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు 4వ తేదీన మధ్యాహ్నం పెట్రోల్ బంకుకు చేరడంతో సమాచారం తెలుసుకొని వాహనచోదకులు పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకుకు వచ్చారు. అయితే ఇక్కడ పెట్రోల్, డీజిల్ కొట్టేవారు లేరు. ఒక్కరే సిబ్బంది ఉన్నారు. దీనిపై ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. బంకులో ఒక్కొక్కసారి పెట్రోల్ ఉన్నా పెట్రోల్ గన్నలు పనిచేయడం లేదని, లాక్ పడిపోయిందని కుంటి షాపులు చెబుతూ వినియోగదారులను ఇబ్బందులు గురి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జీసీసీ అధికారులు ఈ బంకుపై దృష్టిసారించి, పెట్రోల్, డీజిల్ పూర్తిస్థాయిలో ఉన్నట్లు, సిబ్బంది విధుల్లో ఉండటట్లు చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు.










