ప్రజాశక్తి - దేవనకొండ
వినియోగదారులకు అన్ని రకాల వసతులను కల్పించి సేవలు అందించాలని నిబంధనలు ఉన్నప్పటికీ నూతనంగా ఏర్పాటు చేసిన ఓ పెట్రోల్ బంకులో కనీస వసతులు కరువయ్యాయి. పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు వస్తున్న వినియోగదారులకు కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని తెర్నేకల్ గ్రామ శివారులో ఇండియన్ ఆయిల్‌కు చెందిన ఒక పెట్రోల్ బంకును నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాల్సిన వసతులు లేవని వినియోగదారులు విమర్శిస్తున్నారు. పెట్రోల్ బంకులో ఫైర్ బకెట్, సిలిండర్స్, తాగునీటి సదుపాయం, టాయిలెట్స్ గదులు, ఎయిర్ మిషన్స్ ఉండాలి. బంకు నిర్వాహకులు మాత్రం కనీస వసతులను మరిచారని పలువురు వినియోగదారులు విమర్శిస్తున్నారు. వేసవిలో వేడిమి, ఎండలు తీవ్రంగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ వేసే పంపు సెట్ల దగ్గర కూడా షెడ్ ఏర్పాటు చేయడం విస్మరించారు. సంబంధిత అధికారులు పరిశీలించి కనీస వసతులను కల్పించాల్సి ఉందని స్థానికులు, పెట్రోల్, డీజిల్ వినియోగదారులు కోరుతున్నారు.