పెట్రో ఉత్పత్తుల ధరల్లో వరుసగా తొమ్మిదవ రోజైన బుధవారం నాడు కూడా పెరుగుదల నమోదైంది. దేశంలో అక్కడక్కడ లీటర్ పెట్రోలు ధర ఇప్పటికే రూ.100 దాటింది. పెట్రో ఉత్పత్తులు సాధించిన ఈ సెంచరీపై సామాజిక మాధ్యమాలు మారుమోగుతున్నాయి పెట్రో మంటల్లో శలభాల్లా కాలిపోతున్నా మరో మార్గం లేదుకాబట్టి సామాన్యుడు పంటి బిగువున ఈ భారాన్ని భరిస్తున్నాడు. దీనినే అలుసుగా తీసుకున్న నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్పించే చర్యలు తీసుకునే బదులు వేడుక చూస్తున్నట్లు వ్యవహరిస్తోంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన 2014 నాటితో పోలిస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఎంతగానో తగ్గాయి. ఫలితంగా అనేక దేశాల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాయి. కానీ మన దేశంలో మాత్రం దానికి భిన్నం! అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గేకొద్దీ, దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు చుక్కలను దాటి పరుగులు తీస్తున్నాయి. మోడీ అధికారం చేపట్టిన నాటికి పెట్రోలు బేసిక్ ప్రైస్ సుమారుగా రూ.47 ఉండగా, ఇప్పుడు రూ.29.34కు పడిపోయింది. అదే సమయంలో అమ్మకం ధర మాత్రం రూ.71.40 నుండి దేశవ్యాప్తంగా సగటున రూ.95కు చేరింది. పెట్రో దోపిడి జరుగుతున్న తీరుకు ఈ ఒక్క ఉదాహరణ చాలేమో!
కరోనా కష్టకాలం లోనూ దేశ ప్రజలను పీల్చి పిప్పి చేయడానికే మోడీ సర్కారు ప్రాధాన్యత నిచ్చింది. అమెరికాతో సహా దాదాపుగా అన్ని దేశాల్లోనూ పేద ప్రజలకు నగదును అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. మోడీ సర్కారు మాత్రం కార్పొరేట్లకు భారీ ప్యాకేజిలు ప్రకటించి, పేదలకు పప్పు బెల్లాలను పంచింది. పరోక్ష పన్నుల రూపంలో గుంజకున్నది పరిగణలోకి తీసుకుంటే పప్పు బెల్లాల ప్రభావం దాదాపు శూన్యం, భారాల కష్టాలే ఘనం! ఈ లెక్కలు చూడండి! అంతర్జాతీయ మార్కెట్లో గడిచిన 14 నెలల కాలంలో డాలర్‌ను ప్రామాణికంగా తీసుకుంటే ముడి చమురు ధరలు 5 శాతం తగ్గాయి. దేశంలో పెట్రోలు, డీజల్ ధరలు ఆ మేరకు తగ్గకు పోగా జనవరి 2020తో పోలిస్తే 20 శాతం పెరిగాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ వంటి దేశాలతో పాటు అమెరికాలో ఈ కాలంలో 5 నుండి 7 శాతం ధరలు తగ్గాయి. డాలర్ కన్నా బలంగా ఉండే స్థానిక కరెన్సీ ఉన్న చైనా, కొరియా వంటి దేశాల్లో కూడా తగ్గుదల కనిపించింది. మన దేశంలో మాత్రం ధరల్లో తగ్గుదల కనిపించకపోగా, ప్రపంచంలోనే అత్యధిక పెరుగుదల వైపు పరుగులు తీస్తుండటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
తిలా పాపం తలా పిడికెడన్నట్లు కేంద్రం వసూలు చేసే పన్నుల్లో వాటా కోసం వెంపర్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న ఈ భారాన్ని నామమాత్రంగా కూడా ప్రశ్నించడంలేదు. గడిచిన మూడు సంవత్సరాల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వడ్డించిన ఎక్సైజ్ భారం దేశవ్యాప్తంగా రూ.14 లక్షల కోట్లు! సాధారణంగా కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఉంటుంది. అయితే, ఇటీవల కాలంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వనవసరంలేని సెస్సులను విధించడం ద్వారా ఆ వాటాను కూడా కేంద్రం దిగమింగుతోంది. ఇటీవల పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.3.20 లక్షల కోట్ల పెట్రో అమ్మకాల ద్వారా కేంద్ర ఖజానాకు చేరుతుందని అంచనా వేయగా, దానిలో రాష్ట్ర ప్రభుత్వాల వాటా కేవలం రూ.7 వేల కోట్లు (2.1శాతం) మాత్రమే! దీంతో సొంత ఖజానాలను నింపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు పన్నులను, వ్యాట్‌లను విధిస్తున్నాయి. ఫలితంగా గోడ దెబ్బ, చెంప దెబ్బ తప్పనిస్థితి సామాన్యులకు నెలకొంది. పెట్రో ధరల పెంపుతో అన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితమౌతాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోతుంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా పతనమౌతుంది. అయినా, కార్పొరేట్ల ప్రయోజనాలే ముఖ్యమని కేంద్రం భావిస్తే ధరల మంటను ఇంకేమాత్రం భరించలేని స్థితికి సామాన్యులు చేరి ఆ వేడి కేంద్ర పాలక పార్టీ అధికార పీఠానికీ తాకక తప్పదు!










