Mar 10,2021 07:08

చమురు ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో అన్ని వర్గాల ప్రజలు గగ్గోలు పెడుతుంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా వ్యవహరిస్తున్నది. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, కిరోసిన్‌ ఇలా అన్ని రకాల చమురు ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుంటే, ఇందుకు సిగ్గుపడాల్సింది పోయి ఏదో ఘనకార్యం సాధించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖామాత్యులు పార్లమెంటులో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఉన్నది. గత ఏడేళ్లలో వంటగ్యాస్‌ ధర రెట్టింపు అయిందని, అదే సమయంలో పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల రాబడి రూ. 52,537 కోట్ల నుండి రూ. 3 లక్షల కోట్లకు పెరిగిందని ఘనంగా సెలవిచ్చారు. ఇదంతా ప్రజలపై పన్నులు మీద పన్నులు వేసి వారి మూల్గులను పీల్చి పిప్పి చేయడం ద్వారా సాధించిందే. కార్పొరేట్లకు రాయితీలు, బాకీల మాఫీ పేరుతో లక్షల కోట్ల రూపాయలను ఒక వైపు దోచిపెడుతూ, మరో వైపు ఖాళీ అయిన ఖజానాను నింపుకోవడం కోసం పెట్రో ధరలను ఎడాపెడా పెంచుకుంటూ పోతున్నది. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ రంగాన్ని కాసుల వర్షం కురిపించే కామధేనువుగా కేంద్రం భావిస్తున్నది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా కేంద్రం ఆర్జిస్తున్న మొత్తం రాబడిలో 17 శాతం దాకా ఈ చమురు ఉత్పత్తుల నుంచి సమకూరుతున్నదే. ఇది స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో మూడు శాతానికి సమానం. లీటర్‌ పెట్రోల్‌ ధరలో 63 శాతం దాకా ఈ పన్నులే ఉంటున్నాయి. వీటిలో కేంద్ర పన్నులు 40 శాతం దాకా ఉంటే, రాష్ట్రాలు వ్యాట్‌ పేరుతో విధించిన పన్ను 23 శాతంగా ఉంది. పెట్రో ధరలు ఇంతగా విజృంభించడానికి అధిక పన్నులే కారణమని ఏ స్కూలు పిల్లవాడ్ని అడిగినా ఇట్టే ఠక్కున చెప్పేస్తాడు. కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు మాత్రం పెట్రో ధరల పెరుగుదలకు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడమే కారణమని వాదిస్తున్నాయి. ఇది బోడిగుండుకు మోకాలికి ముడివేయడమే. ముడి చమురు ధరలు కరోనా కాలంలో ఒక్కసారిగా పడిపోయాయి. అయినా అప్పుడు మన దేశంలో పెట్రో ధరలు తగ్గలేదు. మోడీ ప్రభుత్వం పన్నులు అమాంతం పెంచివేయడమే కారణం. ముడి చమురు ధర తగ్గినా, పెరిగినా పెట్రో ధరలు పెంచుతూ పోవడమే మోడీ ప్రభుత్వ విధానమని స్పష్టంగా కనపడుతూనే ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చమురు ఉత్పత్తులపై పెద్దయెత్తున పన్నులు విధించిన ఘనత మోడీ ప్రభుత్వానిదే.
ఇటీవల బడ్జెట్‌లో వ్యవసాయ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌ను లీటర్‌ పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.4 చొప్పున విధించింది. వసూలైన పన్నుల్లో రాష్ట్రాలతో 41 శాతం పంచుకోవాలి. అదే సెస్‌, సర్‌ఛార్జీల పేరుతో వడ్డిస్తే ఆ మొత్తం కేంద్రం ఖాతాలోకే పోతుంది. ఇదీ తాజా బడ్జెట్‌లో బిజెపి అనుసరించిన వ్యూహం. పెరిగిన ధరలపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాలంటే జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడమొక్కటే పరిష్కారం అన్నట్లు కేంద్ర మంత్రులు, వారికి వంత పాడే 'నిపుణులు' అంటున్నారు. అత్యధిక రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులను మినహాయించే షరతుపైనే జిఎస్‌టి వ్యవస్థకు ఆమోదం తెలిపాయి. కానీ, కేంద్రం పెట్రో ఉత్పత్తులపై వచ్చే పన్ను రాబడిపైనే దృష్టి పెట్టింది. కేంద్రం జిఎస్‌టిలో రాష్ట్రాల వాటా ఎగ్గొట్టి మొండి చెయ్యి చూపుతోంది. ఇప్పుడు పెట్రో ఉత్పత్తులు కూడా ఆ పరిధిలోనే చేరితే రాష్ట్రాలకు మిగిలేది ఖాళీ చిప్పే. కేంద్రం పెట్రో ధరలు తగ్గించడానికి సిద్ధంగా ఉన్నట్లు, రాష్ట్రాలే వెనక్కు లాగుతున్నట్టు ప్రచారం మొదలుపెట్టి తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి బిజెపి ఈ కపట నాటకానికి తెర తీసింది. ఈ నాటకాలను కట్టిపెట్టి పెట్రో ఉత్పత్తులపై భారీగా విధించిన పన్నులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి. లేకుంటే 2014లో ఏ పెట్రో మంటలు అప్పటి యుపిఏ ప్రభుత్వాన్ని అధికారం లోంచి దించాయో అవే మంటలు మోడీ ప్రభుత్వానికీ అదే గతి పట్టించక మానవు.