Jun 05,2023 00:07

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం గగనమవుతోంది. వాయు కాలుష్యం పరిధి దాటుతోంది. పరిశ్రమలు, ఆటోమొబైల్‌ రంగం గుంటూరు పరిసరాల్లో విస్తరిస్తోంది. పెరుగుతున్న వాహనాలు, ఇంధన వినియోగం భారీగా పెరిగింది. విషవాయువులు, సూక్ష్మ, అతి సూక్ష్మ దూళికలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న కాలుష్యానికి ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ వాహనాలను పెంచాలన్న ప్రణాళికలు ఇంకా కార్యరూపం దాల్చడంలేదు. గ్యాస్‌ (సిఎన్‌జి) ఆధారిత వాహనాలు కూడా పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. సూక్ష్మదూళి కణాలతో పాటు నగర పరిసరాల్లో మిర్చి ఆధారిత పరిశ్రమల వల్ల కోరు పెరిగి ఊపరితిత్తుల సమస్యలు ఏర్పడుతున్నాయి.
గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సైడు కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రపర్చకపోవడం, భూగర్భ డ్రెయినేజి వ్యవస్థ ఏర్పాటు పనులు నిలిచిపోవడంతో చాలా ప్రాంతాల్లో మురుగు కాల్వల నుంచి దుర్గంధం వెదజల్లుతుండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వాహనాల నుంచి వస్తున్న కాలుష్యం (పొగ) పరిసర ప్రాంతాలకు వెదజల్లుతోంది. దీంతో గాల్లో సూక్ష్మ దూళికణాల సంఖ్య పెరుగుతోంది. నగరంలో చాలా ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు, తారు రోడ్లున్నా ఇప్పటికీ మార్జిన్లు సరిగా లేక ఒక వాహనం వస్తే మరొక వాహనం కిందకు దిగినప్పుడు దుమ్ము దూళి పెరుగుతున్నాయి. స్టోన్‌ క్రషర్సునుంచి భారీగా దుమ్ము వెదజల్లుతోంది. పేరేచర్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
గుంటూరులో రెండున్నర లక్షల ద్విచక్ర వాహనాలు, 30 వేల ఆటోలు, మరో 10 వేల భారీ వాహనాలు ఉన్నాయి. వీటి ద్వారా వస్తున్న కర్బన్‌ ఉద్గారాలు వల్ల కాలుష్యం పెరుగుతోంది. గుంటూరులో వాహన కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. కాలం చెల్లిన వాహనాలు కూడా చాలా తిరుగుతున్నాయి. 15 ఏళ్ల తరువాత ఏ వాహనం అయినా నడపకూడదని నిబంధనలున్నా చాలామంది 30 ఏళ్లపాటు నడుపుతున్నవారు కూడా లేకపోలేదు. పాత వాహనాలనుంచి వెదజల్లుతున్న పొగలో దూళి కణాలు ఎక్కువగా ఉంటున్నాయి.
గుంటూరు పరిసరాల్లో పొలాల్లో వ్యవసాయ ఉత్పుత్తుల విక్రయం ద్వారా వచ్చే వ్యర్ధాలను కూడా పొలాల్లోనే తగులబెడుతున్నారు. వీటి ద్వారా వచ్చే పొగకూడా పరిసర ప్రాంతాలకు కాలుష్యం వెదజల్లుతోంది. సూక్ష్మ దూళి కణాలు, అతిసూక్ష్మ దూళి కణాల వల్ల మహిళలు, చిన్నారులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. వీరు వేర్వేరు అవసరాల నిమిత్తం బయటకు వచ్చినప్పుడు, ప్రయాణాల్లోనూ ఈ కాలుష్యం బారిన పడుతున్నారు. మొత్తంగా వాహనాలు,మిర్చి ఆధారిత పరిశ్రమలు, పంట వ్యర్థాలతో పాటు ఆయా మున్సిపాల్టీల నుంచి వచ్చే వ్యర్ధపదార్ధాలను పట్టణాల శివారు ప్రాంతాల్లో తగులబెట్టిన సందర్భంలో వస్తున్న పొగవల్ల కూడా గాలిలో కాలుష్యం అధికంగా ఉంటోంది. గుంటూరులోని కాలుష్య నియంత్రణ మండలి పరిమితమైన ఉద్యోగులతో మొక్కుబడిగా విధులు నిర్వహిస్తోంది. సంబంధిత కాలుష్య కారకులపై ఫిర్యాదులు వస్తే వారికి నోటీసులిచ్చి మమ అనిపిస్తున్నారు.