Mar 14,2023 23:00

ప్రజాశక్తి-కంచికచర్ల : మండలంలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో కొద్ది రోజులుగా జ్వర పీడితులతో ప్రైవేట్‌ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఎక్కువగా 15 ఏళ్లలోపు పిల్లలు జలుబు, దగ్గు, జ్వరం బారిన పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులకుతోడు వేసవి కాలం ప్రారంభంకావడంతో ఎండ తీవ్రతకు జ్వరం పీడితుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇది ప్రైవేటు ఆస్పత్రులకు వరంగా మారింది. వేలకు వేల వసూలు చేస్తూ దండుకుంటున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. మూడు నాలుగు రోజులకు కూడా జ్వరం తగ్గకపోవటంతో, కొత్త రకం వైరస్‌ వల్ల జ్వరం వస్తుందని చెప్పి యాంటీబయోటిక్‌ మందులు ఇస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కంచికచర్లలో ఓ 15 ఏళ్ల యువకుడికి జ్వరం సోకి నాలుగు రోజులకు కూడా తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి రెండు రోజుల ఉంచి కొత్త రకం వైరస్‌ వల్ల జ్వరం వచ్చిందని పలు రకాల రక్త పరీక్షలు చేసి, మందులతో కలిపి రూ.10 వేలకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. ఇలా కంచికచర్లలో పలు ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు జ్వరపీడితులను దోచుకుంటున్నారు. దీనికి తోడు మెడికల్‌ షాపు యజమానులు సైతం వేలకు వేలు వసూలు చేస్తున్నారు. తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, ప్రైవేట్‌ ఆస్పత్రులపై నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.