Jun 05,2022 09:29

పెరుగులో ఉండే బ్యాక్టీరియా మనకు మేలు చేస్తుంది. ఎండలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఈ మండే సమయంలో కాస్త చల్లగా పెరుగు తీసుకుంటే హాయిగా అనిపిస్తుంది. పెరుగుతో పాటు ఫలాలూ జోడిస్తే.. రుచికి రుచి.. ఫలితానికి ఫలితం లభిస్తుంది.. పెరుగును, పండ్లను పిల్లల్ని తినమంటే పేచీలు పెడతారు. అదే ఇలా కలగలిపి ఇస్తే.. ఆస్వాదిస్తూ ఆరగిస్తారు.. మరి అవి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

అరటిపండుతో..

bananna


కావలసిన పదార్థాలు: అరటిపళ్లు - రెండు, పెరుగు - పావుకేజీ, జీలకర్ర పొడి - టీస్పూన్‌, ఆవాలు - అర టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, ఎండుమిర్చి - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - తగినంత.
తయారీ విధానం :కుక్కర్‌లో అరటిపండ్లు వేసి ఒక్క విజిల్‌ వచ్చే వరకూ ఉడికించాలి. తరువాత పొట్టు తీసి గుజ్జుగా చేసుకోవాలి. ఒక పాత్రలో పెరుగు తీసుకుని, బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు అందులో అరటిపండు గుజ్జు, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు వేసి వేగించాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. ఈ పోపుని రైతాపై పోయాలి. వెజిటబుల్‌ బిర్యానీలో ఈ రైతా వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.
మామిడిపండుతో..

mango


కావలసిన పదార్థాలు: మామిడిపండ్లు - రెండు, పెరుగు - రెండు కప్పులు, పంచదార - రెండు స్పూన్లు, నెయ్యి - టేబుల్‌స్పూన్‌, ఆవాలు - టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, మెంతులు - పావు టీస్పూన్‌
తయారీ విధానం : మామిడిపండ్లను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక పాత్రలో పెరుగు, పంచదార తీసుకోవాలి. పంచదార కరిగే వరకూ స్పూన్‌తో కలియబెట్టాలి. ఇప్పుడు అందులో మామిడిపండు ముక్కలు వేసి కలుపుకోవాలి. మరొక పాత్ర తీసుకొని స్టవ్‌పై పెట్టి, నెయ్యి వేసి కాస్త వేడయ్యాక ఆవాలు వేయాలి. అవి చిటపటలాడుతుంటే ఎండుమిర్చి, మెంతులు వేసి మరికాసేపు వేగించాలి. ఈ పోపు మిశ్రమాన్ని మామిడిపండు రైతాపై పోసి కలుపుకోవాలి. కొన్ని మామిడి ముక్కలతో గార్నిష్‌ చేసుకోవాలి. ఫ్రిజ్‌లో కాసేపు పెట్టుకుని కూల్‌ మ్యాంగో రైతాను సర్వ్‌ చేసుకోవాలి.
దానిమ్మతో..

danimma


కావలసిన పదార్థాలు: దానిమ్మ గింజలు - కప్పు, ఉడికించిన బంగాళదుంప గుజ్జు - కప్పు, మీగడ లేని పెరుగు - కప్పు, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, కొత్తిమీర తరుగు - టేబుల్‌ స్పూను, పంచదార, ఉప్పు - రుచికి తగినంత, చాట్‌ మసాల - అర టీ స్పూను.
తయారీ విధానం : పెరుగులో పంచదార, ఉప్పు వేసి, బాగా గిలకొట్టాలి. తర్వాత బంగాళదుంప గుజ్జు, పచ్చిమిర్చి తరుగు, దానిమ్మ గింజలు, చిటికెడు చాట్‌ మసాల వేసి బాగా కలపాలి. కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, తినేముందు చాట్‌ మసాల, కొత్తిమీర చల్లి, సర్వ్‌ చేసుకోవాలి.
కీరాతో..

kera


కావలసిన పదార్థాలు : కీర - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, పెరుగు -కప్పు, కారం - అర టీస్పూన్‌, నిమ్మకాయ - ఒకటి, కొత్తిమీర కట్ట - ఒకటి.
తయారీ విధానం : ముందుగా ఒక పాత్రలో పెరుగు తీసుకొని అందులో ఉల్లిపాయలు, కీర ముక్కలు సన్నగా కట్‌ చేసుకుని, వేసుకోవాలి. వాటిల్లో నిమ్మరసం కలుపుకోవాలి. తరువాత తగినంత ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టుకొని చల్లగా సర్వ్‌ చేసుకోవాలి.
ద్రాక్షతో..

grape


కావలసిన పదార్థాలు: పెరుగు - రెండు కప్పులు, గ్రీన్‌ ద్రాక్షపండ్లు (సీడ్‌లెస్‌, నిలువుగా రెండు భాగాలు కట్‌ చేసుకోవాలి) -కప్పు, పంచదార - ఒకటిన్నర టీస్పూన్‌, ఉప్పు - సరిపడా, వేగించిన జీలకర్ర పొడి - తగినంత, కారం - కొద్దిగా, పుదీనా - నాలుగు రెమ్మలు.
తయారీ విధానం : చిక్కటి పెరుగును పెద్ద గిన్నెలో వేసి గిలక్కొట్టి జారుగా చేయాలి. ఇందులో ఉప్పు, సరిపడా పంచదార వేయాలి. పంచదార కరిగే వరకూ కలపాలి. తరువాత ద్రాక్షపండ్ల ముక్కలు వేసి, ముక్కలకు పెరుగు బాగా పట్టే వరకూ కలపాలి. జీలకర్ర పొడి, కారం, పుదీనాతో అలంకరించాలి. ఓ నాలుగు ద్రాక్షపండ్ల ముక్కలతో గార్నిష్‌ చేస్తే... చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఈ రైతాను పులావ్‌, బిర్యానీతో తినొచ్చు. లేదంటే వట్టిదే కూడా తినొచ్చు.