పెరూ అధ్యక్ష పదవికి హోరాహోరీగా జరిగిన పోరులో స్కూల్ టీచర్, ప్రగతిశీల వాది పెడ్రో కేస్టిల్లో విజయం సాధించారు. ఆయనకు 50.2 శాతం (87,91,778) ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి మితవాద, నయా ఉదారవాది కెయికో ఫుజిమోరి కి 49.7 శాతం (87, 20, 337) ఓట్లు వచ్చాయి. 3.2 కోట్ల జ.నాభా కలిగిన ఈ చిన్ని లాటిన్ అమెరికా దేశంలో మొత్తం 2.4 కోట్ల మంది ఓటర్లకుగాను 1.7 కోట్ల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. కేస్టిల్లో కు లభించిన ఆధిక్యత (71,443 ఓట్లు) స్వల్పమే అయినా ఈ విజయానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
పెరూ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ఈ అధ్యక్ష ఎన్నికలొచ్చాయి. గత నాలుగేళ్లలో నల్గురు అధ్యక్షులు మారారు. ఒకరు ఓట్ల కొనుగోలు కుంభకోణంలో చిక్కుకుని రాజీనామా చేయగా, మరొకరు అభిశంసనకు గురయ్యారు. మూడవ అధ్యక్షుడు కేవలం వారం రోజుల వ్యవధిలోనే పదవి నుంచి నిష్క్రమించారు. నాల్గవ అధ్యక్షురాలే ప్రస్తుత ఎన్నికలను పర్యవేక్షించిన కెయికో ఫుజిమోరి. ఈ రాజకీయ అస్థిరతకు మూలం పెరూను పట్టి పీడిస్తున్న ఆర్థిక సంక్షోభంలో ఉంది.
నేపథ్యం
పెరూలో అసమానతలు చాలా ఎక్కువ. ఆడ్రియన్ రూరల్ ప్రాంతానికి, ఉత్తర అర్బన్ ప్రాంతాలకు మధ్య ఈ తేడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సంపన్న పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రం ఎక్కువగా తాండవిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో సైతం మురికివాడలుండే ఏరియాలకు, ఆ పక్కన ఉండే సంపన్న ప్రాంతాలకు మధ్య అసమానతలు తీవ్ర స్థాయికి చేరాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఈ అసమానతలకు మరింత ఆజ్యం పోసింది. ఈ సంక్షోభ కాలంలో పది శాతానికి పైగా పెరూ ప్రజలు పేదరికం కిందికి నెట్టివేయబడ్డారు. 62 శాతం మందికి అసలు బ్యాంక్ ఖాతాలే లేవు. 12 శాతం మంది పేదలు చిన్న గదుల్లో కిక్కిరిసి ఉంటున్నారు. నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో ఉంది. ఉపాధి పొందుతున్నవారిలో 70 శాతం దాకా అసంఘటిత రంగ కార్మికులే. అసంఘటిత రంగ కార్మికులు అత్యధికంగా ఉన్న లాటిన్ అమెరికా దేశంగా పెరూ ఘనత సాధించింది. ఉద్యోగం ఎప్పుడుంటుందో, ఎప్పుడు ఊడుతుందో తెలియని అభద్రత వీరిని నిత్యం వెంటాడుతున్నది. తక్కువ వేతనాలతో సంసారం గడవడం కనా కష్టంగా ఉంది. చాలీ చాలని వేతనాలకు పని చేయడమో, లేక పస్తులతో చావడమో జరుగుతోంది. ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు చేరుకున్న వలస కార్మికుల పరిస్థితి మరీ దారుణం.
దేశీయంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుంది. 2016 ఆక్స్‌ఫామ్ రిపోర్టు ప్రకారం లాటిన్ అమెరికాలో భూమిపై ఆధిపత్యం, భూ కేంద్రీకరణ దక్షిణ అమెరికన్ యావరేజి రేటు కన్నా పెరూలో అధికంగా ఉంది. ఒక్క శాతం మంది చేతిలో 77 శాతం భూమి కేంద్రీకృతమై ఉంది. అంటే మిగతా 99 శాతం మంది చేతిలో ఉన్నదానికంటే ఎక్కువ వీరు కలిగివున్నారన్న మాట. 194-2012 మధ్య అయిదు హెక్టార్ల లోపు వున్న వ్యవసాయ కమతాలు 40 శాతానికి పెరిగాయి. చిన్న కమతాలు యావరేజి 1.8 హెక్టార్లకు పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రం పెరిగిందనేందుకు ఇదొక సంకేతం.
పేదరికంతో వచ్చే ఆర్థిక ఇబ్బందులు, అసంతృప్తి వ్యవసాయ కార్మికులు, కార్మికులు, నిరుద్యోగ యువత నిరసనల్లో వ్యక్తమవుతున్నది. ఈ ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం బల ప్రయోగానికి పాల్పడుతోంది. పోలీసు కాల్పులు, దాడుల్లో అనేక మంది చనిపోయారు. మరో వైపు పాలకవర్గ పార్టీలో అవినీతి విశృంఖల రూపం దాల్చింది. దీంతో ప్రజల్లో ఆగ్రహం పెరింది. పెరూలో రాజకీయ అస్థిరతకు, తరచూ అధ్యక్షులు మారడానికి ఇదొక ముఖ్య కారణం.
పెరూ సామాజిక భద్రతా వ్యవస్థ ... ప్రత్యేకించి ప్రజారోగ్యం రంగం డొల్లతనాన్ని కోవిడ్-19 మహమ్మారి బయటపెట్టింది. ప్రపంచంలోకెల్లా కరోనా తలసరి మరణాల రేటు పెరూలోనే అధికం. ఇంతవరకు 1,80,000 మంది చనిపోయి నట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. తగినన్ని నిధులు లేని కారణంగా పెరూ ఆరోగ్య వ్యవస్థ కోవిడ్‌ను ఎదుర్కోలేక పూర్తిగా చతికిలపడింది. ఐసియు బెడ్లు చాలా పరిమితంగా అంటే 1600 మాత్రమే ఉన్నాయి. ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరత వెంటాడు తోంది. సకాలంలో సరైన వైద్యం అందక చాలా మంది రోగులు చనిపోయారు. ఇంతవరకు నాలు గు శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయడం జరిగింది. వ్యాక్సినేషన్ విషయంలో పెరూ ఇతర లాటిన్ అమెరికా దేశాల కన్నా వెనుకబడి ఉన్నది.
ఈ నేపథ్యంలో పెరూ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. మొదటి దఫా ఎన్నికలు ఏప్రిల్‌లో నిర్వహించారు. వామపక్ష వాది పెడ్రో కేస్టిల్లో విజేతగా నిలుస్తారని అసలు ఎవరూ ఊహించలేదు. కార్మికోద్యమ నాయకుడు అయిన కేస్టిల్లో రాజకీయాలకు పూర్తిగా కొత్త. చాలా మంది వ్యాఖ్యాతలు ఆయనను తేలికగా తీసిపడేశారు. గత మూడు పర్యాయాలుగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న కెయికో ఫుజిమోరిని రెండో రౌండ్‌లో కేస్టిల్లో సవాల్ చేసినా గెలవడం కష్టమేనని వ్యాఖ్యానించారు.
కేస్టిల్లో చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చారు. టీచర్‌గా, రైతాంగ కార్యకర్తగా చాలా మంది మద్దతు చూరగొన్నారు. పేదల అనుకూల ఎజెండాతో ఎన్నికల ప్రచారంలోకి దిగారు. సుసంపన్నమైన రాగి ఖనిజ నిక్షేపాలు కలిగిన పెరూలో మైనింగ్ సంస్థలపై అధిక పన్నులు వేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎన్నికైతే మైనింగ్ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటానని మరో ముఖ్యమైన వాగ్దానం చేశారు. నిరంకుశాధికార వ్యవస్థ, నయా ఉదారవాద రాజ్యాంగాన్ని తిరగరాసే విషయమై రిఫరెండమ్ నిర్వహిస్తాన న్నారు. మూల వాసుల, మహిళల, రైతుల హక్కులకు, మానవ హక్కులకు ప్రభుత్వం పూచీ పడుతుందన్నారు. ఒక ఉపాధ్యాయుడిగా, కార్యకర్తగా, 2017లో టీచర్ల సమ్మెను నడిపిన అనుభవంతో విద్యా రంగానికి జిడిపి లో 3.5 శాతం నుంచి 10 శాతానికి కేటాయింపులు పెంచుతానన్నారు. విద్య, ఉపాధి కల్పనా రంగాలకు తన విజన్‌లో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు.
మరో వైపు అనుభవజ్ఞురాలైన రాజకీయ నాయకురాలు ఫుజిమోరి ని ఎదుర్కొనేందుకు తన శక్తి యుక్తులన్నిటిని ఉపయోగించారు. మరో వైపు కేస్టిల్లోకి వ్యతిరేకంగా ఫుజిమోరి బురద చల్లే కార్యక్రమం పెద్దయెత్తున చేపట్టారు. రాజకీయాలకు కేస్టిల్లో కొత్త అని, 'షైనింగ్ పాత్' అనే గెరిల్లా గ్రూపుతో ఆయనకు సంబంధాలున్నా యని విమర్శించారు.తాను గెలిస్తే పాత కాపులను తిరిగి పాలనా పరమైన పదవుల్లో ప్రతిష్టిస్తానని, ఈ సీనియర్లంతా తన తండ్రి ఆల్బర్టో ఫుజిమోరి కి సన్నిహితులేనని చెప్పారు. నిజానికి ఆమె తండ్రి పచ్చి నియంత. 1990-2000 మధ్య పెరూ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో దుర్మార్గమైన పాలన సాగించారు. కెయికో గెలిస్తే తన తండ్రిలాగే నిరంకుశ పాలనను రుద్దే ప్రమాదముందని పలువురు భావించారు.
ఆల్బర్టో ఫుజిమోరి హయాంలో నయా ఉదారవాద విధానాలను అత్యంత నిరంకుశంగా అమలు చేశారు. ఆయన అనుసరించిన మితవాద, నిరంకుశ రాజకీయాలను 'ఫుజిమోరియిజం' అని అంటారు. ఆల్బర్టో ఫుజిమోరి ప్రభుత్వం 2,72,028 మందికి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించింది. 'షైనింగ్ పాత్' గెరిల్లాలు, వామపక్ష తీవ్రవాదం అన్న సాకుతో నిరసనలపై క్రూర నిర్బంధాన్ని ప్రయోగించింది. మానవ హక్కులను యథేచ్ఛగా కాలరాసింది. ఫుజిమోరి నిరంకుశ పాలనలో 69, 280 మంది హత్యకు గురి కావడమో, అదృశ్యం కావడమో జరిగినట్లు పెరూ నిజనిర్ధారణ కమిషన్ విచారణలో తేలింది. వీరిలో 80 శాతం మంది గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆరే. అందులోనూ 75 శాతం మంది కిచువా, ఇతర దేశీయ భాషలను మాట్లాడే తెగలకు చెందినవారే. మూలవాసులు, చిన్న రైతుల పట్ల ఫుజిమోరి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందీ తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ. చాలా చోట్ల సామూహిక ఖననాలు చేసిన సమాధులు బయటపడ్డాయి. వెలుగు చూడని సమాధులు ఇంకెన్నో! అనేక ఏళ్ల పోరాటాల ఫలితంగా ఫుజిమోరి అరెస్టు జరిగింది. అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత వంటి నేరాల కింద ఆయన జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. ఇంతకుముందున్న కన్సర్వేటివ్ అధ్యక్షులు ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించి, జైలు నుంచి విడుదలజేయాలని చూశారు. కానీ, ప్రజాందోళనలకు వెరచి వెనక్కి తగ్గారు. కెయికో ఫుజిమోరి ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను గెలిస్తే, తన తండ్రికి క్షమాభిక్ష ప్రసాదించి, విడుదల జేస్తానని చెప్పారు. దేశానికి దృఢమైన నాయకుడు అవసరం చాలా ఉందని, అందుకే తాను ఈ పని చేస్తానన్నారు. ఆమె మాటలు కులీనులు, సంపన్నులు, కన్సర్వేటివ్‌లకు మిక్కిలి సంతోషం కలిగించి ఉండొచ్చు. కానీ, అత్యధిక సంఖ్యాకులుగా వున్న కార్మికులు, కర్షకులు, ఆమె తండ్రి సాగించిన అకృత్యాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కెయికో ఫుజిమోరి గెలిస్తే ఆమె రోసిపోయిన తన తండ్రి పాలనను తిరిగి రుద్దు తారన్న భయాందోళనలకు వీరు గురయ్యారు. నయా ఉదారవాద, మితవాద, నిరంకుశ పాలనను తిరిగి నెలకొల్పే ప్రమాదం ఉందని భావించిన వీరంతా కలసికట్టుగా ఆమెను ఓడించారు.
ఏప్రిల్‌లో మొదటి రౌండ్ ఎన్నికల్లో ఓటింగ్ చాలా పేలవంగా జరిగింది. చాలా మంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఫుజిమోరి గెలిస్తే ప్రమాదమని ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు వామపక్ష శక్తులకు ప్రేరణనిచ్చాయి. దాంతో ఓటర్లను సమీకరించే యత్నాలను ముమ్మరం చేశాయి. కెయికో ఫుజిమోరి తనకు తాను స్వచ్ఛమైన రాజకీయ నాయకురాలని ఎంతగా ఊదరగొట్టినా జనం విశ్వసించే స్థితి లేదు. ఎన్నికల ప్రచారం కోసం 1.7 కోట్ల డాలర్ల అక్రమ నిధులు ఆమెకు ముట్టాయని, నేరస్థ సంస్థలు అమెకు దన్నుగా ముందుకొచ్చాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవి గనుక నిజమని విచారణలో తేలితే ఫుజి మోరికి 30 ఏళ్లు జైలు ఖాయం. ఆమె అవినీతికర పాలనపై ప్రజల్లో ఆగ్రహం ఉంది. ఎన్నికల్లో వీరంతా ఆమెకు వ్యతిరేకంగా ఓటు చేశారు.
కేస్టిల్లోకు అండగా గ్రామీణం
కేస్టిల్లోకు గ్రామీణ ప్రాంతాల నుంచి గట్టి మద్దతు లభించింది. సంపన్న పట్టణ ప్రాంతాల ఓటర్లు, ఇతర దేశాల్లో ఉన్న పెరూవియన్ల మద్దతు ఫుజిమోరి కి లభించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పట్టణ ప్రాంత ఓట్లను మొదట లెక్కబెట్టడంతో ఫుజిమోరి తొలుత ఆధిక్యత సాధించారు. గ్రామీణ ఓట్ల్లు లెక్కింపు మొదలెట్టాక ఆమె ఆధిక్యతలు ఆవిరైపోయి చివరికి కేస్టిల్లో విజేతగా నిలిచారు. ప్రారంభ దశలో తాను ఆధిక్యంలో ఉండగా ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగాయని ప్రశంసించిన ఫుజిమోరి, తీరా ఓటమి ఎదురయ్యేసరికి కేస్టిల్లో ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఫలితాలను తాను తిరస్కరిస్తున్నానన్నారు. నిరసనలకు దిగారు.
ఎన్నికల ఫలితాలను తిరస్కరించడం మితవాద శక్తుల ముందస్తు ఎత్తుగడలో భాగమేనని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కేస్టిల్లో తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. నూతన పెరూ ఆవిర్భావానికి లభించిన ఈ అవకాశాన్ని దెబ్బ తీయాలని చూస్తున్న శక్తుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
నేడు కేస్టిల్లో ముందున్న గడ్డు సవాళ్లలో ఒకటి పెరూ కొత్త దేశంగా పునర్జన్మ ఎత్తడం. ఇది వాస్తవ రూపం దాల్చాలంటే పాలకవర్గాలతో అమీతుమీకి ఆయన సిద్ధం కావాల్సి ఉంటుంది. రాజ్యాంగ యంత్రానికి సంబంధించిన పార్లమెంటుతో సహా అన్ని సంస్థల పైన పాలకవర్గాల ఆధిపత్యాన్ని బద్దలుకొట్టాలి. జులై 28న ప్రమాణ స్వీకారం చేసిన మరు క్షణం నుంచే తన ఎన్నికల హామీల అమలుకు కేస్టిల్లో నడుం బిగించాలి. లాటిన్ అమెరికాలో పదే పదే పునరావృతమవుతూ వస్తున్న కొన్ని అనుభవాల రీత్యా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండడమొక్కటే కేస్టిల్లో ముందున్న మార్గం. ప్రజలు కూడా అప్రమత్తంగా వుంటూ, పోరాటాల ద్వారా ఆ దిశగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.
ఆర్- అరుణ్ కుమార్ (వ్యాసకర్త సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు)










