ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం పెరటి కోళ్ల పెంపకంతో రైతులు అధిక ఆదాయం సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ మల్లేశ్వరి సూచించారు. శనివారం మండల పరిధిలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెరటి కోళ్ల పెంపకం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయా పొందవచ్చన్నారు. ప్రస్తుత కాలంలో వ్యవసాయంతోపాటు అనుబంధ విభాగాల్లో కూడా నైపుణ్యం సాధించాలన్నారు. ఇందులో భాగంగా పెరటి కోళ్ల పెంపకం, డైరీ యూనిట్ ఏర్పాటుపై మెళకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ కె.మాధవి మాట్లాడుతూ కోళ్ళ మేత ధర తగ్గించుకోవడం కోసం అందుబాటులో ఉన్న వివిధ చిరుధాన్యాలతో కోళ్ల మేత తయారు చేసుకోవాలన్నారు. కోళ్ళ పెంపకం చేసే రైతులు కొక్కెర తెగులు, నులి పురుగులు సమస్య, ఖనిజ లవణాల లోపాల నుండి కాపాడుకుంటే అధిక ఆదాయం పొందవచ్చన్నారు. నాటు కోళ్ల మాంసం, గుడ్ల ప్రాముక్యత, పోషక విలువలను తెలియజేశారు. రైతులందరికీ ఆసీల్ జాతి కోళ్లను (10 సంఖ్య) అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కెవికె ప్రోగ్రాం కో ఆర్డినేటర్, పశు వైద్య శాస్త్రవేత్తలతోపాటు 25 మంది రైతులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ మల్లేశ్వరి










