Sep 30,2023 21:55

భక్తులతో క్యూలైన్ల బారులు

పెరటాశి 'పోటు'
సర్వదర్శనానికి 48 గంటలు
5 కిలోమీటర్ల మేర క్యూలైన్లు
రద్దీకి అనుగుణంగా టిటిడి ఏర్పాట్లు
ప్రజాశక్తి - తిరుమల
తమిళ పెరటాశి నెల రెండో శనివారంతో పాటు, వరుస సెలవులు ఉండడంతో తిరుమల కొండ భక్తులతో పోటెత్తింది. తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతోనూ,. అలిపిరి వద్ద ఉన్న పార్కింగ్‌ ప్రాంతాలన్నీ వాహనాలతోనూ నిండిపోయాయి. అలిపిరి నుంచి ఎస్వీ వేద విశ్వ విద్యాలయం వరకూ తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చిన బస్సులతో నిలిచి ఉన్నాయి. శుక్రవారం నుంచి అలిపిరి రహదారికి ఇరువైపులా బస్సులు బారులు తీరి ఉన్నాయి.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1, 2, నారాయణగిరి షెడ్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గురువారం నుండి క్యూ లైన్లలో వున్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా టీటీడీ అందిస్తోంది. దాదాపు 2500 మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు సేవలు అందిస్తున్నారు. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లు, లగేజీ కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాదం, రిసెప్షన్‌, కల్యాణకట్ట, ఆలయంలోపల క్యూ లైన్ల నిర్వహణ, చెప్పల్‌ స్టాండ్‌లు మొదలైన వాటి వద్ద వివిధ షిఫ్టుల్లో సేవలందిస్తున్నారు. వివిధ శాఖలు యాత్రికుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వేచి ఉన్న యాత్రికులకు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. సెప్టెంబర్‌ 30వ తేదీ నాటికి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి టోకెన్‌ లేని భక్తులకు దాదాపు 48 గంటల సమయం పడుతోంది. టీటీడీ రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ఈ విషయమై తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో నిరంతరం ప్రకటనలు చేస్తోంది. దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండవలసి వస్తోంది. కావున ఈ దర్శన సమయాన్ని దష్టిలో ఉంచుకుని భక్తులు తమ ప్రయాణాన్ని రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. రద్దీ దష్ట్యా సర్వదర్శనం టోకెన్ల కోటా తగ్గించడం గమనార్హం
అలిపిరిలో సామాన్య భక్తులకు కేటాయించే సర్వదర్శనం టోకెన్లను టిటిడి కుదించింది. 25వేల టోకెన్లను కేటాయించాల్సి వున్నా 19 వేలకు పరిమితం చేయడం భక్తుల నుండి వ్యతిరేకత వ్యక్తమౌతుంది. వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కాకుండా తిరుగుముఖం పడుతున్నారు. ఆలయం వద్ద కొబ్బరి మొక్కు చెల్లించి వెళ్లడం బాధాకరంగా ఉందని తమిళనాడు వానియంబడికి చెందిన కదిరివేలు అనే భక్తుడు 'ప్రజాశక్తి'కి తెలిపారు. కుటుంబసమేతంగా వచ్చిన శ్రీనివాసన్‌ తాను ప్రతిఏటా పెరటాసిి మాసంలో తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శన భాగ్యం చేసుకునే వాడినని, ఈ పర్యాయం తాను దర్శించుకోకుండా వెళ్లడం బాధగా ఉందన్నారు. టిటిడి అన్ని సదుపాయాలు చేస్తున్నమని చెప్పి దర్శనం కాకుండా కిలోమీటర్ల కొద్దీ భక్తులను తీవ్ర ఇబ్బందులు పాల్జేస్తోందని తెలిపారు.మరో మూడు శనివారాల్లో ఉచిత దర్శనం మాత్రమే
పెరటాసి నెల కారణంగా అక్టోబర్‌ 1 వతేది, 7 వతేది, 8 వతేది, 14 వతేదీన కేటాయించే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసినట్టు టిటిడి ప్రకటించింది.
శనివారం సాయంత్రానికి అందిన సమాచారం:
శనివారం సాయంత్రానికి అందిన సమాచారం మేరకు శ్రీవారికి 34,800 మంది భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. అలిపిరి మార్గం గుండా కాలినడకన 21వేల మంది నడిచిరాగా శ్రీవారి మెట్టు మార్గంలో 12 వేల మంది చేరుకున్నారు. అలిపిరి మార్గంలో 8,600 వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి.
భక్తులతో క్యూలైన్ల బారులు