
ప్రజాశక్తి - వీరవాసరం
మండలంలోని పెర్కిపాలెం గ్రామానికి చెందిన లంకా సత్యసాయి(12) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరవాసరం ఎంఆర్‌కె జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న సత్యసాయి సోమవారం సాయంత్రం స్కూల్ విడిచిపెట్టిన తరువాత ఇంటికి వచ్చి గదిలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న సత్యసాయి అక్క దృవణకృతి ఇంటికి వచ్చేసరికి సత్యసాయి ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఆమె ఇంటి పక్కనున్న వారిని పిలవడంతో వారు వచ్చి బాలుడును కిందికి దింపారు. తాపీపనికి వెళ్లిన తండ్రి లంకా సుబ్రహ్మణ్యానికి, కూలి పనికి వెళ్లిన తల్లి సుబ్బలక్ష్మికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఇంటికి వచ్చి తన కుమారుడిని వీరవాసరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి మోటర్ సైకిల్‌పై తీసుకెళ్లారు. వెంటనే అక్కడ ఆరోగ్య సిబ్బంది సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మృతుడు సత్యసాయి ఇంటి నుంచి రూ.వెయ్యి స్కూల్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. తాను పట్టికెళ్లిన డబ్బులను సహచర విద్యార్థులకు ఖర్చు చేస్తుండగా డబ్బుల విషయమైౖ సత్యసాయిని ఎక్కడవి అంటూ ఆరాతీస్తూ ఇంటివద్ద చెబుతామంటూ హెచ్చరించారు. ఈ విషయం తల్లితండ్రులకు తెలిస్తే ఎక్కడ మందలిస్తారోనని భయపడి సత్యసాయి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. సుబ్రహ్మణ్యం, సుబ్బలక్ష్మి దంపతులుకు ముగ్గురు సంతానం ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెళ్లి చేయగా రెండో కుమార్తె దృవణకృతి పదో తరగతి చదువుతుంది. ఇద్దరి ఆడపిల్లల తరువాత మూడో సంతానంగా సత్యసాయి పుట్టడంతో ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారని, నెమ్మదస్తుడుగా ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. సత్యసాయి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.