Aug 30,2023 00:31

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వర్షాభావం కష్టాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు లేకపోవడం, వేడి తీవ్రత కొనసాగుతుండటం వల్ల విద్యుత్‌ వినియోగం పెరిగింది. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడం వల్ల అత్యవసర లోడ్‌ రిలీఫ్‌ పేరుతో అప్రకటిత కోతలు అమలు చేస్తున్నారు. అధికారికంగా ఎటువంటి కోతలూ లేకున్నా వినియోగం ఎక్కువ కాగానే గ్రామాల్లో పగటి సమయంలో ఫీడర్లుట్రిప్‌ అవుతుండటంతో ఆకస్మికంగా సరఫురా ఆగిపోతోంది. మరోవైపు వేసవిలో ఉన్నంత వినియోగం ఉందని అధికారులు తెలిపారు. పగటి సమయంలో కూడా ఏసీలు, కూలర్లు వినియోగం కొనసాగుతోంది. సాధారణంగా జనవరి నుంచి జూన్‌ వరకు వినియోగం ఎక్కువగా ఉంటుందని, జులై నుంచి డిసెంబరు వరకు వినియోగం తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జులై,ఆగస్టు నెలల్లో కూడా వినియోగం ఎక్కువగా ఉంటోంది.
ఉమ్మడి జిల్లాలో వేసవిలో 20 వేల మిలియన్‌ యూనిట్ల వరకు వినియోగిస్తారు. జులై తరువాత 16 నుంచి 17 మిలియన్‌ యూనిట్లకు తగ్గుతుంది. కానీ ప్రస్తుతం 20 మిలియన్‌ యూనిట్లు వినియోగం జరుగుతోంది. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు, వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల గరిష్టంగా మే, జూన్‌ నెలల్లో 21వేల మిలియన్‌ యూనిట్లు వరకు వినియోగించారు. ఏటా ఆగస్టులో భారీ వర్షాలు కురిస్తే గరిష్టంగా 15 మిలియన్‌ యూనిట్ల వినియోగం ఉంటుంది. ఈ ఏడాది వర్షాల్లేక ఎండల తీవ్రత కొనసాగడం వల్ల డిమాండ్‌ పెరిగింది.
వ్యవసాయ విద్యుత్‌ వినియోగమూ గణనీయంగా పెరుగుతోంది. దాదాపు లక్ష కనెక్షన్లకు రోజుకు 9 గంటల పగటిపూట సరఫరా జరుగుతోంది. దీంతో పగటి డిమాండ్‌ బాగా పెరగడం వల్ల విద్యుత్‌ పంపిణీ సంస్థలపై కూడా భారం పెరిగిందంటున్నారు. వ్యవసాయ విద్యుత్‌ వినియోగం ప్రతిఏటా ఆగస్టులో తక్కువగా ఉంటుందని ఈ ఏడాది వర్షాలు లేకపోవడం వల్ల బాగా పెరిగిందంటున్నారు. దాదాపు రెండు లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంపు సెట్ల ద్వారా సాగు జరుగుతోంది. ఇందులో ఆక్వాకల్చర్‌ సాగు కూడా ఎక్కువగానే ఉంది. జిల్లా మొత్తం మీద 19.70 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 2 లక్షలు వాణిజ్య కనెక్షేన్లు, 10 వేల వరకు పరిశ్రమలకు సంబంధించిన కనెక్షన్లు ఉన్నాయి. లక్ష వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు కొనసాగుతున్నాయి. పెరిగిన విద్యుత్‌ వినియోగంతో పరిశ్రమలకు ఆంక్షలు అమలు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కేవలం విద్యుత్‌ లైట్లకు మాత్రమే వినియోగించుకోవాలని, ఉత్పత్తి చేయరాదని మౌఖిక ఆదేశాలిచ్చారు. గతంలో కంటే విద్యుత్‌ సరఫరా మెరుగుపడినా వినియోగం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు.