Apr 13,2023 23:05

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఎండల తీవ్రత ఎక్కువైంది. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా ఇవి మరికొన్ని రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 42.9, రెంటచింతల 42.5, రొంపిచర్ల 42.4, క్రోసూరు 42.2, గుంటూరు జిల్లా తెనాలి, ఫిరంగిపురంలో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదై ప్రజలు వేసవితాపంతో అల్లాడిపోయారు. కాకుమాను 40.9, కొల్లిపర 41.7, మేడికొండూరు 41.6, పెదకాకాని 41.7, పెదనందిపాడు 40.4, పొన్నూరు, ప్రత్తిపాడు 40.5, తాడేపల్లి 40.9, తాడికొండ 41.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా మాచర్ల 40.9, నాదెండ్ల 41.9, వెల్దుర్తి 41.7, శావల్యాపురం 41.2, నర్సరావుపేట 41.2, నకరికల్లు 40.7, నూజెండ్ల 41.8, అమరావతి 40.9, మాచర్ల 40.9, పెదకూరపాడు 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
శుక్రవారం పల్నాడు జిల్లాలో 8 మండలాలు, గుంటూరు జిల్లాలో 11 మండలాల్లో వేడిగాలులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ డైరెక్టర్‌ అంబేద్కర్‌ గురువారం రాత్రి ప్రకటించారు. జిల్లాలోని చేబ్రోలు, దుగ్గిరాల, గుంటూరు, కొల్లిపర, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తెనాలి, తుళ్లూరు, పల్నాడు జిల్లా అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసూరు, మాచవరం, పెదకూరపాడు, సత్తెనపల్లి, రాజుపాలెం మండలాల్లో 39 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వేసవి తీవ్రతతో ప్రజలు అల్లాడుతున్నారు. పిడుగురాళ్ల, మాచర్ల, గురజాల, నర్సరావుపేట, వినుకొండ తదితర ప్రాంతాల్లో వేడిగాలలు తీవ్రతకు పిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకూ వడగాల్పులు వీస్తున్నాయి. సాయంత్రం 5 గంటల తరువాత వేడిగాలులు కొంతమేరకు తగ్గుముఖం పడ్తున్నాయి. ఏసీలు, కూలర్లు ఉన్నవారు ఉదయం నుంచి నిరాటకంగా వినియోగించడం వల్ల విద్యుత్‌కు బాగా డిమాండ్‌ ఏర్పడింది. సగటున జిల్లాలో 20 శాతం విద్యుత్‌ వినియోగం పెరిగినట్టు అధికారులు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో పనులు చేస్తున్న వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు ఎండ తీవ్రతకు అవస్థ పడుతున్నారు. ఎండలో ఇళ్లకు వెళ్లలేక ఎక్కడ నీడ దొరికితే అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో, జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉండే భారీ చెట్లను తొలగించడం వల్ల పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు నీడ లేక రహదారులపైనే ఉరుకులు పరుగులు పెడుతూ దుకాణాల వద్ద కొద్ది సేపు నిలబడుతున్నారు. వివిధ పనుల మీద గుంటూరుకు వస్తున్న కార్మికులు ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందడానికి నానా తంటాలు పడుతున్నారు.