Jun 04,2023 22:11

ప్రజాశక్తి - ముదినేపల్లి
               రోహిణికార్తె ప్రభావంతో పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, ఉక్కపోతలతో వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తీవ్రరూపం దాల్చిన ఎండలతో మండల ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఎండల తీవ్రతకు ప్రజలు ఇళ్లలో ఉండలేక, బయటకు రాలేక సతమతమవుతున్నారు. ఎసి గదుల నుంచి జనం బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఉక్కపోత, వడగాల్పులకు వృద్ధులు, చిన్నారులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.
ఆసుపత్రులు కిటకిట
నెలరోజులు మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పదుల సంఖ్యలో ప్రజలు వడదెబ్బకు గురయ్యారు. ముఖ్యంగా వీరిలో వృద్ధులు పెద్దసంఖ్యలో ఉన్నారు. తర్వాత స్థానంలో చిన్నారులు ఉన్నారు. వడదెబ్బకు గురైన బాధితులు ముదినేపల్లిలోని వివిధ ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఆయా గ్రామాల్లో స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపి, పిఎంపిలను ఆశ్రయిస్తూ చికిత్స పొందుతున్నారు. ముదినేపల్లిలో రోజుకు పది మంది వరకు వడదెబ్బకు గురై ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు అంచనా.
పది గంటలకే హోటళ్లు బంద్‌
ఎండతీవ్రతకు ఆదివారం ఉదయం పది గంటలకే హోటళ్లన్నీ బంద్‌ అయ్యాయి. ఎండలు మండిపోవడంతో చిరువ్యాపారులు పది గంటల్లోపే తమ అమ్మకాలు ఆపేస్తున్నారు. పది గంటలు తర్వాత ముదినేపల్లి సెంటర్‌లో అల్పాహారం దొరకడం లేదు. దీంతో దూరం ప్రాంత ప్రయాణాలు చేసేవారు ఇబ్బందులు పడ్డారు. వ్యాపార సంస్థలు సైత 12 గంటలకు మూసేసి సాయంత్రం ఐదు గంటల తర్వాత తెరుస్తున్నారు.
ఉదయం ఆటలు రద్దు
రోహిణి కార్తె ప్రభావంతో ఎండలు మండిపోవడంతో జనం రోడ్డెక్కే పరిస్థితి లేదు. దీంతో సినిమాలకు వచ్చే వారిసంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో సాయంత్రం 6-15 గంటలు, రాత్రి 9-15 గంటల ఆటలు మాత్రమే ప్రదర్శిస్తున్నారు.
తగ్గిన పాల దిగుబడి
వడగాల్పులతో పశువుల్లో పాల దిగుబడులు బాగా తగ్గాయి. ఎండలకు పశువులు మేత సరిగా తీసుకోకపోవడంతో పాల దిగుబడులు బాగా తగ్గినట్లు పాడి రైతులు చెబుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు తోలుకెళ్లి పది గంటల్లోపే పశువులను ఇళ్లకు తోలుకు వస్తున్నారు. సాయంత్రం 4 గంటలు తర్వాత మళ్లీ మేతకు వదులుతున్నారు. దీంతో మేత సమయం తక్కువగా ఉండడంతో పాల దిగుబడి తగ్గుతున్నట్లు చెబుతున్నారు. మధ్నాహ్న సమయాల్లో ఊరచెరువుల్లో ఉంచి పశువులను కాపాడుకుంటున్నారు. పశువుల పాకల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనా మండే ఎండలతో ప్రజలు, పశుపక్ష్యాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
వడదెబ్బకు గురైతే ఇలా చేయండి
వడదెబ్బకు గురైన వ్యక్తి శరీరానికి విపరీతమైన చెమటలు పడతాయి. వాంతులు, విరోచనాల లక్షణాలతోపాటు బాగా నీరస పడిపోయి అపస్మారక స్థితికి చేరతారు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. వడదెబ్బకు గురైన వ్యక్తికి చల్లని నీటితో స్నానం చేయించాలి. తడి గుడ్డతో తరచూ శరీరం తుడుస్తూ ఉండాలని ప్రముఖ వైద్యులు మనోజ్‌ తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని, ఎండలో వెళ్లేవారు తప్పక చెవులకు రుమాలు కట్టుకొని, తలకు టోపీ, కళ్లజోడు ధరించాలని సూచించారు. ఇళ్లవద్ద ఉన్న వారు మజ్జిగలో ఉప్పు, పంచదార కలుపుకుని తరచూ తాగాలన్నారు. తడి తుండు ఎప్పుడూ వీపు పైనే ఉంచుకోవాలని, కొబ్బరినీళ్లు, తాటిముంజులు, చెరకురసం, మజ్జిగ తరచు తాగాలని పేర్కొన్నారు.