ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వేసవి తీవ్రత మరింత పెరిగింది. రోహిణీకార్తె ప్రభావంతో వడగాల్పులు భారీగా పెరిగాయి. దీంతో వృద్ధులు, పిల్లలు అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వేడిగాలుల ప్రభావం కన్పిస్తోంది. వడగాల్పులతో పగటి సమయంలో ప్రజలు భయటకురావడానికి ఇబ్బంది పడుతున్నారు. వడగాల్పుల వల్ల మధ్యాహ్నం 12 గంటల కల్లా రహదారులన్నీ నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. కొంతమంది మాస్కులు, టోపీలు, గొడుగులు, ముసుగులు ధరించి బయటకు వస్తున్నారు. జనసంచారం తగ్గడంతో ఆటోలు, సిటీ సర్వీసులు ఖాళీగా తిరుగుతున్నాయి.
రోహిణీ కార్తె ప్రవేశంతో గత నెల 25వ తేదీ నుంచి 8 రోజులుగా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. జంగమేశ్వరపురంలో అత్యధికంగా శుక్రవారం 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తాజాగా వాతావరణ విభాగం, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం రానున్న నాలుగు రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా గుంటూరు, పల్నాడు, జిల్లాల్లో గరిష్టంగా 47 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. మే 10వ తేదీ నుంచి వేసవి తీవ్రత బాగా పెరిగింది. గతనెల 25 వరకు కూడా వేడిగాలులు ప్రభావం ఉన్నా రోహిణీకార్తె తరువాత వడగాల్పుల ప్రభావం పెరిగింది. వేసవి తాపం, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అధికంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు, వికలాంగలు, చిన్నారులు బయటకు వెళ్లలేక, ఇంట్లో ఉండలేక ఉక్కపోతతో నరకయాతన అనుభవిస్తున్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో అదనపు లోడ్ రిలీఫ్ పేరుతో రాత్రి వేళ రెండు గంటలనుంచి మూడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పగటి పూట గంట పాటు సగటున విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. మరమ్మతుల పేరుతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. వేసవి తీవ్రత పెరగడంతో శీతల పానియాలకు గిరాకి పెరిగింది. ఈ ఏడాది మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకపోవడంతో సామాన్య ప్రజలు దుకాణాల నుంచి కొనుగోలు చేయక తప్పడం లేదు. సాయంత్రం కల్లా ఐస్‌క్రీమ్ పార్లర్లు, శీతల పానియాల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. రుతుపవనాలు వచ్చి వర్షాలు కురిస్తే ఈ ఏడాది తొందరగా వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఈనెల 10వ తేదీ తరువాత రుతుపవనాలు జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.










