Apr 21,2023 00:14

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : వాతావరణంలో మార్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గురువారం ఉదయం కొద్దిసేపు వాతావరణం చల్లగా ఉన్నా అనంతరం ఎండ తీవ్రత పెరిగింది. ఉదయం 7.30 గంటలనుంచి ఎనిమిది గంటల వరకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమై వాతావరణం చల్లబడింది. 9 గంటల నుంచి ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం నుంచి వేడిగాలులు మొదలయ్యాయి. రాత్రి వరకు ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు.
ఉష్ణోగ్రతలు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. అదనపులోడ్‌ రిలీఫ్‌ పేరుతో రాత్రి వేళ గ్రామాల్లో కొద్దిసేపు విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నారు. గురువారం గుంటూరు జిల్లాలో 12, పల్నాడు జిల్లాలో 24 మండలాల్లో వడగాల్పులు వీచాయి. రాజుపాలెంలో అత్యధికంగా 43.5, సత్తెనపల్లిలో 42.8, పెదనందిపాడు, కొల్లిపరలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన మండలాల జాబితాలో అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, బొల్లాపల్లి, చిలకలూరిపేట, దాచేపల్లి, దుర్గి, గురజాల, ఈపూరు, కారెంపూడి, క్రోసూరు, మాచవరం, మాచర్ల, ముప్పాళ్ల, నాదెండ్ల, నర్సరావుపేట, నకరికల్లు, పెదకూరపాడు, పిడుగురాళ, రెంటచింతల, రొంపిచర్ల, సత్తెనపలి, శావల్యాపురం, వెల్దుర్తి, వినుకొండ మండలాలున్నాయి. గుంటూరు జిల్లాలో చేబ్రోలు, దుగ్గిరాల, గుంటూరు, కొల్లిపర, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, పెదనందిపాడు, ఫిరంగిపురం, తాడేపల్లి, తెనాలి, తుళ్లూరు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వేసవి తీవ్రత నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకూ వడగాల్పులు వీస్తున్నాయి. సాయంత్రం 5 గంటల తరువాత వేడిగాలులు కొంతమేరకు తగ్గుముఖం పడుతున్నాయి. వేసవి తీవ్రత వల్ల ఆర్‌టిసి బస్సుల్లో పగటి వేళ ప్రయాణికుల సంఖ్య తగ్గినట్లు ఆర్‌టిసి వర్గాలు తెలిపాయి. పట్టణ ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు జనసంచారం తక్కువగా ఉంటోంది. పొలాల్లో పనులు చేస్తున్న కూలీలు, ఉపాధి హామీ కార్మికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రోడ్డుపక్కన వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులు కూడా ఎండ తీవ్రతకు అల్లాడుతున్నారు. పాఠశాలలు ఈ ఏడాది 12.30 నుంచి 12.45 వరకు కొనసాగిస్తున్నారు. గతంలో 12 గంటలకు మూసివేసేవారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసి ఇళ్లకు వెళ్లే సరికి 1.30 గంటలవుతోంది. ఈ క్రమంలో విద్యార్థులు పాఠశాలల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇళ్లకు వెళ్లడానికి అవస్థ పడుతున్నారు.