Oct 30,2022 21:39

సిఐటియు మహాసభల్లో నేతలు
ప్రజాశక్తి - నూజివీడు

             నిత్యావసరాల ధరలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నాయని, ఆ మేరకు వేతనాలు పెంచకుండా యాజమాన్యాలు కార్మికులను దోచుకుంటున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ విమర్శించారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో సిఐటియు పట్టణ నాలుగో మహాసభ ఆదివారం జరిగింది. మహాసభకు పి.కమల, ఎన్‌ఆర్‌.హనుమాన్‌ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ముఖ్యఅతిథి ప్రసాద్‌ మాట్లాడుతూ కనీస వేతనాల సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో కార్మికులందరికీ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని గద్దెనెక్కిన జగన్మోహన్‌రెడ్డి మూడేళ్లు దాటినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదన్నారు. ప్రధాని మోడీ మన దేశం మన కాళ్లపై నిలబడాలంటూనే మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు అమ్మడం బాధాకరమన్నారు. ఈ నిర్ణయం వల్ల రిజర్వేషన్లు రద్దవుతాయన్నారు. ప్రజలు ఉచిత సేవలకు పూర్తిగా దూరమవుతారని అన్నారు. కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను రద్దు చేసి యాజమాన్యాల వ్యాపారాలు సులభతరం చేయడం కోసం నాలుగు లేబర్‌ కోడ్‌లు తెచ్చారన్నారు. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. అనంతరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్‌ఆర్‌.హనుమాన్‌, జి.రాజు, మరో 18 మందితో నూతన కమిటీ ఎన్నికైంది.
దెందులూరు: అంగన్వాడీ కేంద్రాలకు, మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వమే గ్యాస్‌ సరఫరా చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.లింగరాజు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సిఐటియు మూడో మండల మహాసభ కామేశ్వరి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా లింగరాజు మాట్లాడారు. మండలంలో ఫ్యాక్టరీల కార్మికులకు అతితక్కువ వేతనాలు ఇస్తూ బానిసలుగా పని చేయిస్తున్నారని ఆరోపించారు. కార్మిక చట్టాలు యజమానులకు చుట్టాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చాయన్నారు. ప్రతి కార్మికునికీ రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎం.రమేష్‌, కార్యదర్శిగా కామేశ్వరి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు కొర్రి విజయలక్ష్మి, విఆర్‌ఎ సంఘం జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మయ్య, యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి తొంటా శ్రీను, ఆటో యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ జి.గోపాలం పాల్గొన్నారు.