ప్రజాశక్తి - విజయవాడ : పెరిగిన బియ్యం ధరలపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు అన్నారు. గురువారం పలు షాపుల్లో ధరలను ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. బియ్యం, నిత్యావసర సరుకుల ధరలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ బియ్యం కేజీకి రూ.8 నుండి 12 కు పెరిగాయని అన్నారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బియ్యంపై కూడా జిఎస్టి భారం వేయటం దారుణమన్నారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను మోడీ సర్కార్ అడ్డగోలుగా పెంచిందని మండిపడ్డారు. పెట్రోలు, డీజిల్ పై తొమ్మిదేళ్లలో 25 లక్షల కోట్ల రూపాయలు పన్నుల భారం ప్రజలపై వేసి ఖజానా నింపుకుందన్నారు. రిటైల్ వర్తకంలోకి కార్పొరేట్, బహుళ జాతి కంపెనీల ప్రవేశంతో చిన్న, మధ్య తరగతి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. రిటైల్ మార్కెట్ కార్పొరేట్ల చేతుల్లో బందీగా మారింది. వ్యవస్థీకత బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని దుయ్యబట్టారు. ఈ ధరలను వ్యతిరేకిస్తూ సిపిఎం సెప్టెంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో బాబురావు వెంట సిపిఎం నేతలు, ప్రజా సంఘాల నాయకులు కే.సరోజా, వై.సుబ్బారావు, క్రాంతి, గురుమూర్తి, లక్ష్మణ, కోరుట్ల శ్రీనివాస్, గౌరీ వినోద్ కుమార్ పాల్గొన్నారు.










