
ప్రజాశక్తి గోరంట్ల రూరల్ : శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే మాల గుండ్ల శంకర నారాయణ కారుపై ఆగంతకుడు ఎలక్ట్రికల్ డిటోనేటర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఆదివారం గోరంట్లలో జరిగిన ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ గడ్డం తండా పంచాయతీలోని కల్లితండాలో జరిగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడానికి కారులో బయలుదేరాడు. కల్లితండాకు చేరుకున్న శంకరనారాయణ తన వాహనం దిగి కొంత దూరం వెళ్లగానే పక్కనే ఉన్న ఆగంతకుడు ఎలక్ట్రికల్ డిటోనేటర్‌ను ఎమ్మెల్యే వాహనంపై విసిరాడు. గమనించిన డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సిఐ సుబ్బరాయుడు కారువద్డ పడిఉన్న డిటోనేటర్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అయితే ఈ సంఘటనతో నాయకులు, గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే శంకరానారాయణ విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్లుగా పెనుకొండ నియోజకవర్గంలో ఎలాంటి ఫ్యాక్షన్‌కు తావివ్వకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ పాలన అందిస్తున్నాని అన్నారు. అయితే ఇది గిట్టనివారు ఇలాంటి పనికి ఒడిగట్టారని విమర్శించారు. ఈఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలను బయటకు తీయాలని కోరాడు. ఈ సంఘటనపై సిఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన గణేష్ నాసన్ లో రాళ్లు తొలగించే వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. అయితే ఆదివారం అతిగా మద్యం సేవించి వెళ్లడంతో కాంట్రాక్టర్ రమణ గణేష్‌ను పనిలోకి పిలుచుకోలేదన్నారు. దీంతో గణేష్ సోమందేపల్లి మండలం నుండి వాహన ర్యాలీకి వస్తున్న ద్విచక్ర వాహనాలలో వచ్చి ర్యాలీలో పాల్గొని తిరిగి కల్లితండాకు చేరుకొని తన జేబులో ఉన్న డిటోనేటర్‌ను మద్యం మత్తులో విసిరాడని వివరించారు. ఈఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందన్నారు. ఎమ్మెల్యేపై దాడి సమాచారం అందుకున్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్‌వి మాధవరెడ్డి, పెనుకొండ డీఎస్పీ హుస్సేన్‌పీరా గోరంట్ల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి జరిగిన సంఘటనపై సిఐ సుబ్బరాయుడుతో సమీక్షించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పూర్తిస్థాయిలో విచారణ అనంతరం వివరాలు మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరానారయణ సోదరులు మల్లికార్జున, రవీంద్ర తదితరులు గోరంట్లకు వచ్చి పరిస్థితినిఅడిగి తెలుసుకున్నారు.