ప్రజాశక్తి -ములగాడ : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్‌ను పెంచి, పెన్షనర్ల కుటుంబాలను ఆదుకోవాలని సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌కె.హుస్సేన్ అన్నారు. సోమవారం మల్కాపురం జోన్ సిఐటియు వెంకన్నపాలెం కార్యాలయంలో ి కె.నూకరాజు అధ్యక్షతన ఎపిఆర్‌పిఎ ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షనర్ల సమావేశంలో మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు లక్షలకోట్లు రుణాలను మాఫీ చేస్తున్న ప్రభుత్వం, పెన్షనర్ల పట్ల వివక్ష చూపడం దారుణమన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఈ ఏడాది డిసెంబర్ 7,8తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాలో పెద్దఎత్తున పెన్షనర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం పట్టుదలతో పోరాటం చేస్తున్న పెన్షనర్లకు ధన్యవాదాలు తెలిపారు. డిమాండ్లను సాధించేవరకు ఐక్యపోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎం.సూర్యారావు, సిహెచ్.తమ్మారావు పాల్గొన్నారు.










