May 11,2023 00:17

జిల్లా ఖజానా అధికారికి వినతిపత్రం ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : పెన్షనర్లు ఇకెవైసి పూర్తి చేయాల్సిన గడువు ఈనెల 10వ తేదీతో ముగిసిందని, అయితే ఇంకా అనేక మంది చేసుకోవాల్సి ఉన్నదని గడువు ఈనెల 30వ తేదీ వరకూ పెంచాలని ఆలిండియా స్టేట్‌ పెన్షనర్స్‌ ఫెడరేషన్‌ నాయకులు కోరారు. బుధవారం జిల్లా ఖజానా అధికారి బి.రాజగోపాల్‌కు ఫెడరేషన్‌ నాయకులు వినతిపత్రం అందచేశారు. అనారోగ్య కారణాలతో ఇల్లు కదలలేనివారు, 75-95 ఏళ్లు వయసులో ఉన్న వారు వారి ఆధార్‌ కార్డులను మొబైల్‌ ఫోన్‌ నంబర్లు అనుసంధానం కాలేదని తెలుసుకొని, ఆధార్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కొంతమంది ఆధార్‌ కేంద్రాలకు వెళ్లలేని వారు వేలిముద్రల పని చేయని వారు పెన్షన్‌ రాదేమోనని ఆందోళన చెందుతున్నారని అన్నారు. వృద్ధాప్యంలో పిల్లల దగ్గర లేక, ఒంటరి జీవితం గడుపుతున్న వృద్ధులను దృష్టిలో పెట్టుకొని పరిష్కారమార్గం తెలపాలని, మంచానికి పరిమితమైన వారికి ఇకెవైసి నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. జిల్లా ఖజానా అధికారి స్పందిస్తూ వీలైనంత త్వరగా ఇకెవైసి పూర్తి చేసుకోవాలని, అసోసియేషన్‌ నాయకులు తెలిపిన అంశాలను రాష్ట్ర అధికారుల దృష్టికి కూడా తీసుకెళతామని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి పి.నాగరాజు, పెన్షనర్స్‌ వాయిస్‌ ఏపీ ఎడిటర్‌ టి.శ్రీనివాసరావు, సభ్యులు ఐ.సాయిబాబు, ఎం.నాగేంద్రరావు, ఎన్‌.రమణబాబు, ఎంఎన్‌.మూర్తి, డిఎస్‌ఎన్‌ మూర్తి పాల్గొన్నారు.