
ఎస్‌జిపిఎ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల అసోసియేషన్ నిరంతరాయంగా పోరాడుతుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని ఎన్‌జిఒ హోంలో బుధవారం జిల్లాస్థాయి పెన్షనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘంలో గతంలో కొందరు నాయకులు వ్యక్తిగత ప్రాపకం కోసం పనిచేస్తూ పెన్షనర్లకు ఇబ్బందుల పాల్జేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘానికి ఏక నాయకత్వం ఉండడం వల్ల ఈ పరిస్థితి ఎదురైందన్నారు. న్నికలను సైతం నిర్వహించకుండా తమను తామే నాయకులుగా ప్రకటించుకుని స్వార్థ ప్రయోజనాల కోసం పెన్షనర్ల సమస్యలను పక్కన పెట్టారన్నారు. పెన్షనర్లకు నాలుగు ప్రధాన సంఘాలు ఉన్నాయని, పిఆర్‌సి కోసం ఈ సంఘాలు పోరాడుతున్నా ప్రభుత్వాలు మాత్రం స్పందించకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులను పరిష్కరించకుండా అణగదొక్కుతుందన్నారు. ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల కన్నా ప్రభుత్వ పెన్షననుదారులే ఎక్కువగా ఉన్నారని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తే ఉద్యోగ సంఘంగా పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతినెలా 1న జీతాలు చెల్లించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాఘవరావు, జిల్లా అధ్యక్షుడు ఆర్.రామచంద్రరావు, కార్యదర్శి డి.ధర్మారావు, కోశాదికారి బి.మోహనరావు, పొందూరు అప్పారావు, కార్యదర్శి సూర్యప్రకాశరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.శాంతారావు, గౌరీకాంతారావు, జగన్నాథరావు పాల్గొన్నారు.