Dec 17,2022 23:36

టిడిపి నాయకుడు పైలా ప్రసాదరావును సత్కరిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కె.కోటపాడు
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టిడిపి మాడుగుల నియోజకవర్గ నాయకులు పైలా ప్రసాదరావు డిమాండ్‌ చేశారు. శనివారం జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక ఐటిఐ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లపై తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. మండల పెన్షనర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు బండారు సత్యనారాయణ మాట్లాడుతూ 2018 నుండి పిఆర్‌సి, డిఏ బకాయిలు అందించాలని డిమాండ్‌ చేశారు. షరతులు లేని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఏర్పాటు చేయాలని, నగదు రహిత హెల్త్‌ కార్డులు అందించాలని కోరారు. ప్రతి నెలా మొదటి తేదీనే పెన్షన్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. మొత్తం తొమ్మిది రకాల డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు జి.అప్పలనాయుడు, కె.సరోజినీబాయి, మల్లు నాయుడు, బత్తి వెంకటరమణ, సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.