సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు బుధవారం జోరు వానను సైతం లెక్క చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు రోడ్డెక్కవలసిన అగత్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే సృష్టించాయి. ప్రభుత్వ సర్వీసులో చేరినవారికి జీతం నెలనెలా అందుతుందని, రిటైర్ అయ్యాక తమ చివరి నెల జీతంలో నిర్దిష్ట మొత్తం జీవితాంతం పెన్షన్‌గా వస్తుందన్న భరోసా ఉండేది. కాని, ఉద్యోగి పెన్షన్ డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే వినాశకర విధానాన్ని వాజ్‌పేయి హయాంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానిని వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలూ అమలులోకి తెచ్చాయి. తమ పెన్షన్ డబ్బు ఏమవుతుందో తెలియదనీ, ఉద్యోగ విరమణానంతర జీవితానికి భరోసా పోతుందనీ సిపిఎస్ రద్దు కోరుతూ 17 ఏళ్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడం దారుణం. నిజానికి పెన్షన్ పాలకుల భిక్ష కాదు. అది ఉద్యోగ ఉపాధ్యాయులు సాధించుకున్న హక్కు. దాన్ని కాపాడుకోవాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను, విభజనానంతరమూ సిపిఎస్ రద్దు కోరుతూ అనేక ఆందోళనలు సాగాయి. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆవేదనను గమనించిన నాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో 'అధికారానికి వచ్చిన వారంలో రద్దు చేస్తామని' హామీ ఇచ్చారు. అధికారానికొచ్చి రెండేళ్లు దాటినా సిపిఎస్ అలాగే కొనసాగుతోంది. తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ తో సమానమని చెప్పే వైఎస్‌ఆర్‌సిపి ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల విభాగంలో మొదటి పాయింట్‌గా 'సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం' అని పేర్కొన్నారు. మొదటి మంత్రివర్గ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం చేసి, శాసనసభ తీర్మానం చేసినప్పటికీ ఆచరణలో ఏమీ జరగలేదు. ఆందోళనలు పునరావృతం కావడంతో ప్రభుత్వం టక్కర్ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక సమర్పించినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా ఆ నివేదికను అధ్యయనం చేయడానికంటూ కె.ఎ పండిట్ కమిటీ నియమించడం సాచివేతే !
ఒక వ్యక్తి జీవితంలో ప్రధాన దశ, ఎక్కువ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించగలిగిన దశ 25 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య కాలం. అత్యంత విలువైన ఈ కాలాన్ని యజమానికి అమ్ముకున్నప్పుడు ఆ తరువాత శేష జీవితం నిశ్చింతగా గడిపేలా ఏర్పాటు చేయవలసిన బాధ్యత యజమానిదే. ఈ అవగాహన నుండే పెన్షన్ అనేది రూపుదిద్దుకుంది. అంటే ఈ పెన్షన్‌ను ఉద్యోగి తన ఉద్యోగ కాలంలో చేసిన శ్రమ ఫలితంగానే హక్కుగానే పొందుతాడు తప్ప దయా ధర్మ భిక్ష కానే కాదు. ఐతే, నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ఈ పెన్షన్‌ను కూడా కొనుక్కోవలసిన ఒక సరుకుగా మార్చేశాయి. దీనికి పెట్టిన మరో పేరు ఇపిఎస్. పాత పెన్షన్ విధానం ఓ హక్కు అయితే సిపిఎస్ ఒక మార్కెట్ సరుకు. ఉద్యోగుల జీతభత్యాల నుండి నెలనెలా గ్యారెంటీగా స్టాక్ మార్కెట్ కు జమయ్యే చట్టబద్ధ ఏర్పాటే ఈ సిపిఎస్. పోనీ అదైనా పారదర్శకంగా ఉందా అంటే అదీ లేదు. సిపిఎస్ పేరిట మినహాయించబడిన సొమ్ము ఎక్కడ ఎలా వినియోగించబడుతుందో తన ఖాతాలో ఎంత మొత్తం ఉన్నదీ, రిటైర్ అయ్యాక ఎంత తన చేతికి వస్తుందన్న స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయుల్లోనూ వారి కుటుంబ సభ్యుల్లోనూ తీవ్ర ఆందోళన, ఆవేదన తీవ్రంగా ఉంది. దాని ప్రతిరూపమే ఇప్పుడు సాగుతున్న నిరసనలు, ఆందోళనా పోరాటాలు.
ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయి, వాటిని తగు స్ఫూర్తితో అమలు చేయాలంటే ఉద్యోగుల భాగస్వామ్యం ఎంతో అవసరం. అలాగే తమ భవిష్యత్తు ఏమిటన్న గందరగోళంలో పడితే ఉపాధ్యాయులు భావి పౌరులను తీర్చిదిద్దే ప్రక్రియ ముందుకు సాగడం కష్టం. కనుక రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన మాని అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి, చట్ట సవరణ లేదా నిబంధనలు మార్చి సిపిఎస్ రద్దు చేయాలి. అప్పటివరకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు పోరాటాన్ని పట్టుదలగా కొనసాగించాలి. అంతిమ విజయం సాధించాలి.










