Sep 13,2022 22:14

రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న సుబ్బారెడ్డి తదితరులు

ప్రజాశక్తి-పెందుర్తి : విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల వైసిపి కో-ఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి మంగళవారం పెందుర్తిలో పర్యటించారు. వేపగుంటలో రాజశేఖర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాంపురంలో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ కీర్తిశేషులు రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదల పెన్నిదిగా నిలిచారని కొనియాడారు. ఆయన బాటలోనే కుమారుడు జగన్మోహన్‌రెడ్డి నడుస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. మూడు రాజధానులు వల్ల పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. కోర్టు కేసు పరిష్కారమయ్యాక విశాఖ రాజధానిగా పరిపాలన సాగుతుందని స్పష్టంచేశారు. అమరావతి రైతుల పాదయాత్రను వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారో అందరికీ తెలుసన్నారు. స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజల నుంచి ఎంతో ఆదరణ లభిస్తుందనన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ, స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.