ప్రజాశక్తి-చింతూరు
చింతూరు డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో తునికాకు కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బోనస్‌ను తక్షణమే చెల్లించాలని, ఈ ఏడాది తునికాకు కోసిన కార్మికులకు పేమెంట్స్ తక్షణమే ఇవ్వాలని సిపిఎం జిల్లా నాయకులు పల్లపు వెంకట్, కుంజ సీతారామయ్య డిమాండ్ చేశారు. మండలంలోని బురకనకోట గ్రామంలో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ 2012 నుండి తునికాకు కార్మికులకు ప్రభుత్వం నుండి బోనస్ డబ్బులు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. దీనిపై అనేకసార్లు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేసిన ఫలితంగా 2014 నుండి బోనస్ చెల్లిస్తామని చెప్పారని, అవి కూడా ఇంతవరకు చెల్లించలేదని పేర్కొన్నారు. చింతూరు డివిజన్ పరిధిలోని తునికాకు కార్మికులకు రూ.30 కోట్లు ఇవ్వవలసి ఉందన్నారు. ఈ ఏడాది తునికాకు సేకరణ చేసిన చింతూరు, ఏడురాలపల్లి, లక్కవరం యూనిట్లలో కార్మికులకు కట్టకు రూ.3 చొప్పున పేమెంట్లు చేయకుండా అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తునికాకు కార్మికులకు కాంట్రాక్టర్ ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చినప్పటికీ, అటవీ శాఖ వారు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వకుండా తాత్సరం చేస్తూ ఆదివాసీల శ్రమను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు తునికాకు కార్మికులకు పూర్తి పేమెంట్స్ తక్షణమే చెల్లించాలని, లేకుంటే డిఎఫ్‌ఒ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడగయ్య వెంకయ్య, ముత్తయ్య, రమేష్, భద్రయ్య, ఎర్రయ్య, కార్మికులు పాల్గొన్నారు.










