Jan 30,2023 23:26

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

- జిల్లా కలక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశం
ప్రజాశక్తి పాడేరు
: పాడేరు డివిజన్‌లో పలు రోడ్ల నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న అటవీ అనుమతులను త్వరితగతిన మంజూరు చేసి పనులకు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం కలక్టర్‌ చాంబర్‌లో అటవీ, ఇంజినీరింగ్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ, ఎన్‌.ఆర్‌.పురం, గదిలలోవ, గుమ్మకోట, గాలిపాడు మధ్య సుమారు 20 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మాణానికి 17 కిలోమీటర్ల వరకు అటవీ అనుమతులు అవసరమన్నారు. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను వ్యక్తిగతంగా పర్యవేక్షించి అనుమతులు తెప్పించాలని ఇఇ లావణ్య కుమార్‌ను ఆదేశించారు. అదేవిధంగా పుట్లకోట, పామురై రోడ్డు, సిరిబల రోడ్డు నుండి బొనంపల్లి మీదుగా ప. కొత్తూరు రోడ్డుకు సంబంధించి సైన్సు అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ శాఖ కార్యదర్శికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. చింతపల్లి, పాడేరు, నర్సీపట్నం డివిజినల్‌ ఫారెస్ట్‌ అధికారుల ఫరిధిలో ఉన్న మిగిలిన రోడ్లను కూడా సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి తగు అనుమతులు వారంలోగా జారీ చేయాలని ఆదేశించారు. అనంతగిరి, హుకుంపేట, పెదబయలు, ముంచింగిపుట్టు మండలాలల్లో 15 రోడ్ల అభివృద్ధికి జాయింట్‌ ఇన్స్పెక్షన్‌ చేయాలని, ఫిబ్రవరి 10వ తేదీన జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.సమావేశంలో డివిజినల్‌ ఫారెస్ట్‌ అధికారి వినోద్‌ కుమార్‌, కార్య నిర్వాహక ఇంజినీర్లు లావణ్య కుమార్‌, డి వి ఆర్‌ ఎం రాజు, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.
మెరుగైన వైద్యంతో ప్రసూతి మరణాలకు అడ్డుకట్ట
పాడేరు
: మెరుగైన వైద్యసేవలు అందించి ప్రసూతి మరణాలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రసూతి మరణాల పర్యవేక్షణ, స్పందన కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రసూతి మరణాలపై పిహెచ్‌సి వైద్యాధికారులు, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్లు, ఎఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ తప్పిదం వలన ప్రసూతి మరణానికి ఆస్కారమివ్వరాదన్నారు. గర్భిణులు ఆరోగ్యచరిత్ర తెలుసుకుని, హైరిస్క్‌ ఉన్నవారిపౖౖె ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలపై ఆధార పడకుండా, గర్భిణుల ఇళ్లకు వెళ్లి వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. వీరిని డెలివరీ తేదీకి పదిరోజులు ముందుగానే బర్త్‌ వెయిటింగ్‌ హోమ్‌లకు తరలించి, సుఖ ప్రసవం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గర్భిణులకు అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పాలు, పౌష్టికాహారం పంపిణీ, ఇతర సేవలపై ఆరా తీశారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యం అందించాలని ఆదేశించారు సమావేశానికి గైర్హాజరైన అంగన్వాడీ సూపర్‌వైజర్‌ సత్య సుజాత, గుదలంవీధి అంగన్వాడీ కార్యకర్తకు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయాలని ఐసిడిఎస్‌ పిడి సూర్యలక్ష్మిని ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధి నిధులు సక్రమంగా వినియోగించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అంబులెన్సుల ఆయిల్‌కు రూ.ఐదువేలు ఇస్తామన్నారు.సమావేశంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ జమాల్‌ భాషా, ఎడిఎంహెచ్‌ఒ డాక్టర్‌ లీలాప్రసాద్‌, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకరప్రసాద్‌ పాల్గొన్నారు.
2,990 మందికి చేదోడు లబ్ది
జిల్లాలో 2,990 మంది రజక, నాయిబ్రాహ్మణ, దర్జీ లబ్ధిదారులకు జగనన్న చేదోడు పథకం కింద ఒక్కొక్కరికి రూ.పది వేలు చొప్పున రూ.2.99 కోట్ల ఆర్థికసాయం నమూనా చెక్కును జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అందజేశారు. వరుసగా మూడో ఏడాది ఆర్థికసాయం నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, చేదోడు పథకం కింద లబ్ధిపొందిన వారిలో 383 మంది రజక, 252 మంది నాయీబ్రాహ్మణ, 2,355 మంది దర్జీ లబ్ధిదారులున్నారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న లబ్దిదారులు మాట్లాడుతూ వరుసగా మూడో ఏడాది తమ వృత్తులకు రూ.పదివేలు చొప్పున పెట్టుబడిసాయం అందించిన సిఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మురళి, బిసి కార్పోరేషన్‌ ఎఇఒ శంకరరావు పాల్గొన్నారు.