ప్రజాశక్తి-చింతూరు
చింతూరు మేజర్ గ్రామ పంచాయతీ కార్మికులకు 6 నెలల నుంచి 11 నెలల పాటు పెండింగ్‌లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. అనంతరం సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని సర్పంచ్‌కు, కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ ప్రతిరోజూ చింతూరు పట్టణంతో పాటు ఎర్రంపేటలో పారిశుధ్య పనులు చేసి దుర్వాసన నుండి జనాలను కాపాడుతున్న కార్మికులను చిన్నచూపు చూడటం దుర్మార్గమన్నారు. కొంత మందికి 11 నెలలు, మరికొందరికి 9 నెలలు, మరి కొంత మందికి 6నెలల నుంచి జీతాలు చెల్లించలేదని, దీంతో వారి కుటుంబాలు పస్తుంటున్నాయని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు.










