ప్రజాశక్తి -రంపచోడవరం
రంపచోడవరం పరిధిలోని 7 మండలాల్లో ప్రజలకు మంచి నీరు అందించే సత్యసాయి మంచినీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్‌లో వున్న పది నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ స్థానిక ఐటిడిఎ ఎదుట గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను ప్రారంభించిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు మాట్లాడుతూ ఐటీడీఎ, ఆర్‌డబ్ల్యుస్ అధికారులు ఈ కార్మికుల పట్ల అత్యంత నిర్లక్ష్య ధోరణితో వున్నారని విమర్శించారు. మొత్తంగా 125 గ్రామాలకు మంచి నీరు అందించే కార్మికులకు పది నెలలు గా జీతాలు చెల్లించకుండా వారిని ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టడం దారుణమన్నారు. కాంట్రాక్టర్ అసలు పట్టించుకునే పరిస్థితిలో లేరని, అనేక మార్లు అధికారులు, కాంట్రాక్టర్ చుట్టూ కార్మికులు జీతాలు చెల్లించాలని తిరిగిన స్పందించకపోవడంతో సమ్మె చేయాల్సి వచ్చిందని తెలిపారు. గ్రామాలలో గిరిజనులకు నీరు అందకపోవడానికి కారణం అధికారులు, కాంట్రాక్టర్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా స్పంచకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.










