కడప అర్బన్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్‌పి అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని 'పెన్నార్' పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్‌పి మాట్లాడుతూ అతి తీవ్రమైన నేరాలలో త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో వాహన దారులను అప్రమత్తం చేస్తూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలపై నేరాలు, రాబరీ, డకాయిట్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. పోక్సో, మహిళలపై జరిగిన నేరాలపై నిర్ణీత సమయంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. మహిళలు, బాలికల అదశ్యం కేసుల్లో సమగ్ర విచారణ జరిపి అదశ్యమైన వారి ఆచూకీ త్వరగా తెలుసుకోవాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపట్టడంతో పాటు నిఘా పెంచాలన్నారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్‌పి(అడ్మిన్) తుషార్ డూడి, ఎఆర్ అదనపు ఎస్‌పి ఎస్.ఎస్.ఎస్.వి కష్ణారావు పాల్గొన్నారు.










