Nov 16,2023 23:33
పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎస్‌పి మలిక గర్గ్‌

ప్రజాశక్తి-ఒంగోలు క్రైం: పెండింగ్‌ గ్రేవ్‌ యుఐ కేసులకు సత్వరమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని, మర్డర్‌ కేసుల, పోక్సో/రేప్‌ కేసులలో దర్యాప్తు వేగాన్నిపెంచి సరైన సాక్ష్యాధారాలు సేకరించి నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని జిల్లా ఎస్‌పి మలిక గర్గ్‌ అన్నారు. ఒంగోలు సబ్‌ డివిజన్‌లోని ఒంగోలు వన్‌ టౌన్‌, టూ టౌన్‌, తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రేవ్‌, ఎలక్షన్‌ కేసులు, పలు షీట్స్‌, పీడీి యాక్టు, ల్యాండ్‌కు సంబంధించిన కేసులు, గుడ్‌ ట్రయల్‌ మానిటరింగ్‌ కేసులు, ఇతర అంశాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం డిఎస్పీ, సిఐలు, ఎస్‌ఐలతో ఆమె ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న వివిధ కేసుల ప్రస్తుతం స్థితి, కేసుల్లో దర్యాప్తు, అరెస్ట్‌, రికవరీ, కోర్టులో పెండింగ్‌ వున్న కేసులు వాటి స్థితిగతులపై సమీక్షించారు. పోలీస్‌ అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. కేసుల ఛేదింపునకు, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు, మెళకువలను అధికారులకు ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. దొంగతనం కేసుల్లో టెక్నాలజీ ఉపయోగించి కేసులను ఛేదించాలని, ప్రాపర్టీ కేసులలో రికవరీ శాతం పెంచాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పీడీ చట్టం ప్రకారం చర్యలు తీసుకొనేందుకు ప్రతిపాదనలు పంపాలని, ల్యాండ్‌కు సంబంధించిన కేసులలో పూర్తి సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్ట్‌ చేయాలని కోరారు. షీట్స్‌లోని నిందితులకు తగిన శిక్షపడే విధంగా చూడాలని, తీవ్ర నేరాలకు పాల్పడే వ్యక్తులపై, పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసిన వెంటనే సీసీ/పిఆర్‌సి నంబర్స్‌ తీసుకోవాలని, ఎఫ్‌ఎస్‌ఎల్‌ / ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌లను త్వరితగతిన తెప్పించుకోవాలని అన్నారు. గతంలో ఎన్నికలకు సంబంధించిన కేసులపై సమీక్షించారు. న్యాయస్థానాలకు హాజరవుతూ కేసుల్లో నిందితులకు గుడ్‌ ట్రయల్‌ మానిటరింగ్‌ ద్వారా శిక్షలు పడేలా కృషి చేయాలని, పోలీసు అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ (అడ్మిన్‌)కె నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, డిఎస్‌బి డిఎస్పీ బి మరియదాసు, డిసిఆర్‌బి సిఐ ధర్మేంద్ర బాబు, ఒంగోలు వన్‌ టౌన్‌ సీఐ ఎం లక్ష్మణ్‌, ఒంగోలు టూ టౌన్‌ సీఐ జగదీశ్‌, ఒంగోలు తాలూకా సీఐ భక్తవత్సల రెడ్డి, ఎస్‌ఐలు, సిబ్బంది ఉన్నారు.