
గుంటూరు లీగల్: న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్న కేసులను పరిష్కరించటానికి న్యాయమూర్తులు మరింత కృషి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్ సోమయాజులు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా కోర్టులో జిల్లాలోని న్యాయమూర్తుల పనితీరును ఆయన సమీక్షించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి పార్థసారధి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఏడాది జనవరి నుండి జూన్ వరకూ న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు నిర్వహించిన పనితీరును ఆయన సమీక్షించారు. పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు జిల్లాలోని న్యాయమూర్తులు న్యాయవాదుల సహకారంతో కక్షిదారులకు సత్వర న్యాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఇటీవల జిల్లా జడ్జీలుగా ప్రమోషన్ పొందిన జి.చంద్రమౌళేశ్వరి, బి.సాదుబాబులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు సోమయాజులును సత్కరించి, జ్ఞాపిక బహుకరించారు. అనంతరం జిల్లా న్యాయశాఖ సిబ్బంది అధ్యక్షులు పాపిరెడ్డి, పాలపర్తి శ్రీనివాసరావుతోపాటు ఇతర కార్యవర్గ సభ్యులు ఆయనను కలిసి సమస్యలను వివరించారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.