Jun 27,2023 23:33

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ పెండింగులో ఉన్న కేసుల దర్యాప్తుపై దృష్టి పెట్టి బాధితులకు న్యాయం చేయడంతోబాటు నేరస్తులకు శిక్ష పడేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్‌పి ఎస్‌.సతీష్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్‌ అట్రాసిటి కేసులు, మహిళలకు సంబంధించిన కేసులు, గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌, మిస్సింగ్‌ కేసులపై తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి కేసుల సత్వర పరిష్కారం, సక్రమ విచారణ కోసం సంబంధిత దర్యాఫ్తు అధికారులకు సూచించారు. మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సైబర్‌ నేరాలు, ఆన్‌ లైన్‌ ఫ్రాడ్స్‌పై ప్రతి పోలీసు అధికారీ అవగాహన కలిగి ఉండాలి. లోన్‌ యాప్‌ మోసాలపై ప్రజలకు అవగాహన, వాటిపై ప్రచారం కొనసాగించాలి, నమోదైన కేసులలో రికవరీ జరిగేలా దర్యాప్తు జరగాలన్నారు. రాత్రి గస్తీ పెంచి, డైనమిక్‌ బీట్స్‌, ఆస్తి నేరాలు జరిగే ప్రాంతాలపై నిఘా పెంచి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకొని చోరీ సొత్తు రికవరీ పెంచాలన్నారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో ఛార్జ్‌ షీట్లు ఏ విధమైన ఆలస్యం లేకుండా ఫైల్‌ చేసి, కోర్టులో విచారణ ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ శాస్త్రీయ పద్ధతుల్లో కేసుల దర్యాప్తును వేగముగా పూర్తి చేయాలన్నారు. అలవాటుగా నేరాలు చేసే నేరస్తులను గుర్తించి, ఎంపిక చేసిన నేరస్తులపై హిస్టరీ షీట్‌లను తెరచి పక్క జిల్లాల పోలీసు స్టేషన్ల అధికారులతో నిరతరం సమాచారాన్ని పంచుకుంటూ వారి కదలికలపై నిఘా వుంచి వారి ద్వారా భవిష్యత్తులో ఎటువంటి నేరాలు జరగకుండా నివారించాలన్నారు. ఈ సమావేశంలో ఎఎస్‌పి పి.శ్రీనివాస్‌, ఎస్‌డిపిఒలు పి.మురళీ కృష్ణారెడ్డి, లతా కుమారి, డిఎస్‌పి జయరాం ప్రసాద్‌, ట్రాఫిక్‌ డిఎస్‌పి ఎం.వెంకటేశ్వర రావు, సిఐలు, ఎస్‌ఐలు, ఇతర విభాగాల పొలీసు అధికారులు పాల్గొన్నారు.