ప్రజాశక్తి పార్వతీపురం రూరల్ : జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి పూర్తి చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. గురువారం తన కార్యాలయంలో నిర్వహించిన జిల్లా నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులు, నమోదైన కేసులు, పెండింగ్‌లో నున్న కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను, అర్ధ సంవత్సరానికి చెందిన క్రైమ్ రివ్యూ అడిగి తెలుసుకొని సాధ్యమైనంత వరకు త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేవ్ కేసులు, ఎన్‌డిపిఎస్ కేసులు, ఐటి యాక్ట్ కేసులు, మహిళలపై జరిగే అన్యాయాలు, ఆస్తుల దొంగతనాలు వంటి కేసుల గురించి వివరాలు విశ్లేషించి వాటి దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ ఫైల్ చేసి సిసి, ఎస్‌సి నెంబర్లు పొందాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే పెండింగ్లో ఉన్న ఫోక్సో యాక్ట్ కేసులు, రోడ్డు ప్రమాదాలు సంబంధించి కేసులు, బాలబాలికలు, మహిళల మిస్సింగ్ కేసులు, 174 సిఆర్‌పిసి కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు జరపాలని తగు సూచనలు ఇచ్చారు.
ఎక్సైజ్ కేసులు, గంజాయి అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, డ్రంకెన్‌అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ పనులను సమీక్షించి తగు ఆదేశాలు ఇచ్చారు. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమానికి సంబంధించిన ఫిర్యాదులు, ఫోన్ కాల్స్, పట్ల అప్రమత్తంగా ఉండాలని, సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. సీతంపేట పోలీసు స్టేషన్ పరిధిలో గల హడ్డుబంగికి చెందిన మహిళను గాయపరచి పుస్తులతాడును లాక్కొని పోయిన ముద్దాయిని చాకచక్యంగా వ్యవహరించి 12 గంటల్లో పట్టుకొని అరెస్ట్ చేసి చోరీ అయిన సొత్తును రాబట్టి బాధితులకు న్యాయం చేసిన పాలకొండ ఎస్‌ఐ బి.శివప్రసాద్‌కు ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. నేర సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ ఓ.దిలీప్ కిరణ్, ఎఎస్‌పి సునీల్ షరోన్, యుఎస్‌డిపిఒ జివి కృష్ణారావు, దిశా డిఎస్పీ ఎస్.ఆర్‌సి హర్షిత, ఎస్‌బి సిఐ సిహెచ్.లక్ష్మణరావు, డిసిఆర్‌బి సిఐ ఎన్‌వి ప్రభాకర రావు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










