Jul 19,2023 22:57

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక

- ఎస్‌పి జి.ఆర్‌ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
అపరిష్కృతంగా ఉన్న ముఖ్యమైన కేసులను సమగ్ర దర్యాప్తుతో త్వరితగతిన పరిష్కరించాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పోలీస్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన గ్రేవ్‌, ప్రాపర్టీ నేరాలు, పోక్సో, ఎస్‌సి, ఎస్‌టి, ప్రాధాన్యతా కేసుల దర్యాప్తుపై నగరంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీసు అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హత్య కేసులు, ప్రాపర్టీ, ఉమెన్‌ నేరాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. నేర నివారణకు సబ్‌ డివిజన్‌ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాలన్నారు. రాత్రి గస్తీని బలోపేతం చేసి, తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కేసుల నమోదు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు, ఛార్జిషీట్‌ దాఖలు వరకు లోతుగా ఇన్వెస్టిగేషన్‌ చేయాలని సూచించారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రతిరోజూ విస్తృతంగా వాహనాలను తనిఖీ చేయాలన్నారు. గంజాయి కేసుల్లో నిందితులను గుర్తించి కోర్టులో ప్రవేశపెట్టాలని సూచించారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో 60 రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని తెలిపారు. దర్యాప్తును వేగవంతం చేసి కోర్టులో అభియోగ పత్రాలు వీలైనంత వేగంగా దాఖలు చేయాలని సూచించారు. నేరాల నివారణకు, నేరస్తులను గుర్తించడానికి సిసి కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. అన్ని ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, ఆలయాల వద్ద సిసి కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్‌పిలు టి.పి విఠలేశ్వర్‌, జె.తిప్పేస్వామి, డిఎస్‌పిలు డి.బాలచంద్రారెడ్డి, వై.శృతి, జి.నాగేశ్వర్‌రెడ్డి, ఎస్‌.వాసుదేవ్‌, ఎస్‌.బాలరాజు, సిఐలు పాల్గొన్నారు.