Aug 21,2023 00:05

పెండింగ్‌ జీతాలు వెంటనే చెల్లించాలి
యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా డిమాండ్‌
ప్రజాశక్తి-వెంకటగిరి: ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) తిరుపతి జిల్లా మద్యంతర కౌన్సిల్‌ సమావేశం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌ అధ్యక్షతన ఆదివారం వెంకటగిరిలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కౌన్సిల్‌ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మి రాజా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయటానికి జీవో 117ను అమలు చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. జీవో 117 అమలుతో ప్రాథమిక పాఠశాలలు మూతపడే దశకు మారాయన్నారు. ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాల్లోని మూడు, నాలుగు, ఐదు తరగతులు సమీపంలోని ఉన్నత పాఠశాలలో కలపడం వలన ఆ పాఠశాలలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఏమి చేయాలనేది ఉపాధ్యాయ రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘాలను, ఎమ్మెల్సీలను, మేధావులను కూర్చోబెట్టి చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. నాడు- నేడు పేరుతో రంగులు హంగులతో పాఠశాల స్థితిగతులు మారవని నాణ్యమైన బోధన చేయటానికి ఉపాధ్యాయులకు అవసరమైన అనుకూల పరిస్థితులు కల్పించాలని, అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎందుకు అందటం లేదు అనే విషయంపై సమగ్ర చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ టూర్లు ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి ఉపయోగపడవని, విద్యార్థులకు నాణ్యమైన విద్య కూడా అందదని గుర్తించాలన్నారు. ఉపాధ్యాయులను ప్రశాంతమైన వాతావరణంలో బోధన చేసుకోవటానికి అనుకూల పరిస్థితులు కల్పించాలన్నారు. అలా కాకుండా ప్రభుత్వ అధికారులు అదిరింపులు, బెదిరింపులతో భయపెట్టి, విద్యను గాడిలో పెడుతున్నట్లు ప్రజలకు భ్రమలు కల్పించడం తప్ప ఏమి ఒరిగేది లేదన్నారు. ఈసమావేశాన్ని ప్రారంభించిన యూటీయఫ్‌ రాష్ట్రకార్యదర్శి ఎస్‌ఎస్‌.నాయుడు మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్‌ చేసి మూడు నెలలు కూడా గడవకముందే మళ్లీ వర్క్‌ అడ్జస్ట్మెంట్‌ పేరుతో ఉపాధ్యాయ లోకాన్ని గందరగోళాన్ని గురి చేయడం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యంగా కనిపిస్తుందన్నారు. ప్రభుత్వం విద్యాసంవత్సరం మధ్యలో వర్క్‌ అడ్జస్ట్మెంట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే వర్క్‌ అడ్జస్ట్మెంట్‌ ప్రక్రియను ఆపాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. గత రెండు నెలలుగా అనేక ప్రాతినిధ్యాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వ వైపు నుండి ఎలాంటి స్పందన లేకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌ జీతాలు చెల్లించాలని లేనిపక్షంలో ఈ నెల 23న చలో కమిషనర్‌ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సిపిఎస్‌ రద్దు చేసి జిపిఎస్‌ అమలు చేస్తామనే ప్రభుత్వ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, సిపిఎస్‌ రద్దుకు ప్రత్యామ్నాయం పాత పెన్షన్‌ విధానం అమలు తప్ప మరొకటి కాదన్నారు. పాత పెన్షన్‌ విధానం అమలు చేసే వరకు ఉద్యమాలను ఉధతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరెడ్డి ప్రసంగిస్తూ ఉపాధ్యాయులకు రావలసిన ఆర్థిక బకాయిలన్నింటిని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మెడికల్‌ రీయంబర్స్మెంట్‌ చెల్లింపులో తీవ్ర నిర్లక్ష్యం అవలంభిస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న మెడికల్‌ బిల్లులు అన్నింటిని వెంటనే చెల్లించేల చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ మాట్లాడుతూ విలీన పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోరారు. మున్సిపల్‌ ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు చేపట్టదానికి చర్యలు తీసుకోవాలన్నారు. 12వ పిఆర్సి కమిటీ వేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు 11వ పిఆర్‌సికి సంబంధించిన అరియర్స్‌ చెల్లించకపోవడం దారుణం అన్నారు. సమావేశంలో కుమారస్వామి, ఉదయకుమార్‌, సదాశివరెడ్డి, శేఖర్‌, శ్రీదేవి, నిర్మల, పద్మజ, సూర్యప్రకాష్‌, రమేష్‌ నాయుడు, రాజేష్‌ బాబు, రామచంద్రయ్య, ఆదినారాయణ, ఎం.వెంకటేశ్వర్లు, చలపతి, అశోక్‌ బాబు, శ్రీహరి, మస్తానయ్య, వెంకటకష్ణ, శ్రీనివాసులు, మోహన్‌ బాబు, బండి మధు, హరిబాబు, సుధీర్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.