ప్రజాశక్తి-పార్వతీపురం : జీతాలు చెల్లించాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యాన శుక్రవారం డిఇఒ కార్యాలయం వద్ద ఖాళీ ప్లేట్లతో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.మురళీమోహన్‌రావు మాట్లాడుతూ మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. జీతాలపైనే ఆధారపడుతున్న ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా కొత్తగా ఏ జిఒ తీసుకురావాలన్నా నిమిషాల్లో పనైపోతుందని, జీతాలు చెల్లించేందుకు మాత్రం కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జిల్లా అధ్యక్షులు టి.రమేష్ మాట్లాడుతూ రెండు రోజుల్లోగా జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు వి.జ్యోతి, కె.బాస్కర్‌రావు, మురళి, పి.వెంకటినాయుడు తదితరులు పాల్గొన్నారు.










