
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఓటర్ల నమోదుపై పలు రాజకీయ పార్టీలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 18,28,410 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. శాసనసభా నియోజకవర్గాల్లో ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు దావాలు, అభ్యంతరాలపై 14,154 దరఖాస్తులు స్వీకరించినట్లు వెల్లడించారు. చేర్పులకు సంబంధించి ఇప్పటివరకు 18,531, తొలగింపులకు 6,409, దిద్దుబాటుకు 12,133 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఎక్కువ పెండింగ్‌లో ఉన్న మండల తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. గార మండలం మొగదలపాడులో పోలింగు కేంద్రం మార్పు అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు సందేహాలు ఉంటే నివృత్తి చేస్తామన్వారు. తొలగింపులకు సంబంధించి ఫారాలు ఉంటే తప్ప తొలగించలేమని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, వైసిపి నాయకులు రౌతు శంకరరావు, టిడిపి నాయకులు కె.వి రామరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డి.గోవింద మల్లిబాబు, బిఎస్‌పి నాయకులు బి.నారాయణరావు, సి-సెక్షన్ సూపరింటెండెంట్ ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.